రీమేక్ సినిమాలు చేయడం ఈజీనా, కష్టమా అంటే ఒక్కొక్కరూ ఒక్కో మాట చెబుతారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు తీస్తే యాజ్ ఇట్ ఈజ్ అని జోక్ చేస్తారు. ఏమైనా మార్చి తీస్తే సోల్ దెబ్బ తీశారు.. సినిమాలో మజా పోయింది అని విమర్శిస్తారు. అందుకే రీమేక్ సినిమా కత్తి మీద సామే అని చెబుతుంటారు. దీనికి ఇప్పుడు ఇతర భాషల సినిమాల్ని మనోళ్లు ఎక్కువగా చూస్తుండటం కూడా యాడ్ అయింది. సినిమాను అప్పటికే ఓటీటీలోనే, బయటో చూసేయడంతో రీమేక్‌గా మళ్లీ వచ్చినప్పుడు చూడటానికి ఆసక్తి చూపించడం లేదు.
దీంతో ఓటీటీల కాలం రీమేక్ అనేది తప్పు అని కొంతమంది తేల్చేశారు. చాలా మంది అగ్రహీరోల సినిమాల ఫలితాలు కూడా దీనికి ఓ కారణం. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇదే మాట అంటున్నాడు. తమిళ హిట్ సినిమా ‘గరుడన్’కు కొన్ని ఆసక్తికర మార్పులు, కొన్ని బలవంతపు మార్పలు చేసి ‘భైరవం’గా తీసుకొస్తే అందులో నారా రోహిత్, మంచు మనోజ్‌తో కలసి బెల్లంకొండ శ్రీనివాస్ నటించాడు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా ఇబ్బందిపడింది.
తాము ఎంత కష్టపడి చేసినప్పటికీ.. రీమేక్ కావడం వల్లే ఈ సినిమా ఆడలేదని బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తేల్చేశాడు. రీమేక్ చేయడమే తప్పు అని తమకు లేటుగా అర్థమైందని కూడా చెప్పాడు. ‘గరుడన్’ అంత పాపులర్ కాని సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా చూసి ఉండరన్న ఉద్దేశంతోనే చేశామని.. రిలీజ్ ముందు వరకు ఫలితం విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నామని.. కానీ జనం మాత్రం రీమేకే కదా అని తేలిగ్గా తీసి పడేశారని అనిపిస్తోందని చెప్పాడు.
ప్రేక్షకులు ఆ సినిమా పట్ల ఆసక్తి చూపించలేదని, అయినా ఈ విషయంలో ప్రేక్షకులను తప్పుబట్టలేనని చెప్పాడు. అంతెందుకు తాను కూడా వేరే హీరో సినిమా రీమేక్ అంటే చూడడానికి ఆసక్తి చూపించనను అని రెగ్యులర్ మూవీ లవర్‌లా విశ్లేషించాడు బెల్లంకొండ. ‘గరుడన్’ సినిమాను ఎక్కువమంది చూసి ఉండరనే ఉద్దేశంతోనే దాన్ని భారీగా చేద్దామని ట్రై చేశామని కానీ ఫలితం రాలేదని చెప్పాడు.