మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నవరస నటన ప్రదర్శించిన మూవీ రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30 న విడుదలై ప్రపంచవ్యాప్తంగా 214 కోట్ల గ్రాస్ వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన 3వ తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. నాన్ బాహుబలి రికార్డులన్నిటిని తిరగరాసింది. అయితే ఒక విషయంలో మాత్రం “భాగమతి” సినిమాని అధిగమించలేకపోయింది. ఆ విషయమే పైరసీ. తెలుగులో ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో పైరసీ బారినపడిన సినిమాల జాబితాను ఒక జర్మనీ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో “భాగమతి” మొదటి స్థానంలో నిలిచింది.
ఈ సినిమాను 1.9 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పింది. “రంగస్థలం” సినిమాను 1.6 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకోవడంతో రెండో స్థానానికి పరిమితమయింది. మిగతా స్థానాల్లో వరుసగా భరత్ అనే నేను, మహానటి, నా పేరు సూర్య, తొలిప్రేమ, ఛలో, అజ్ఞాతవాసి, జయసింహా, టచ్ చేసి చూడు సినిమాలు నిలిచాయి. ఎంతో కష్టపడి, కోట్లు వెచ్చించి తీసిన సినిమాని ఒక్కరోజులో పైరసీ చేసి సినిమా కలక్షన్స్ ని దెబ్బతీస్తున్నారు. ఇటువంటివారిని అడ్డుకునేందుకు కఠిన శిక్షలు అమలు చేయాలనీ సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.