‘భైరవం’ అంటూ గత కొన్ని నెలలుగా సినిమా గురించి టీమ్ టీజింగ్ చేస్తూనే ఉంది. సినిమాలోని కీలక పాత్రలను పరిచయం చేస్తూ హైప్ పెంచుతూ వెళ్లారు. దానికి తగ్గట్టుగానే సినిమా టీజర్ అదరగొట్టింది. మాస్ యాక్షన్ ఓవర్‌లోడెడ్ అనేలా సిద్ధం చేశారు దర్శకుడు విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) . ఒకానొక సమయంలో అసలు ఈ సినిమా రీమేకేనా? అనే డౌట్ వచ్చేలా చూపించారు. అలాగే ఈ సినిమాలో జాతర ఫైట్ కనిపిస్తోంది. జాతర ఫైట్ కనిపిస్తే ఏముంది అనుకుంటున్నారా? ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) సినిమా వచ్చాక జాతర ఫైట్‌ను అదేదో హిట్ ఎలిమెంట్ అనేలా చిత్రించారు టాలీవుడ్‌లో.
Bhairavam
గతంలో ఎప్పుడూ జాతర ఫైట్లు లేనట్టు, రానట్లు. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు ఇందులో కూడా జాతర ఫైట్ ఉందని టీజర్‌లో చూపించారు. దీంతో ఈ సీన్‌ను నమ్ముకుని సినిమా ఉంది అని అర్థమవుతోంది. అయితే ఆ సీన్ బాగా పండింది అని అంటున్నారు కూడా. బెల్లకొండ సాయిశ్రీనివాస్ సుమారు మూడేళ్లు గ్యాప్ తర్వాత తెలుగులో కనిపిస్తున్న సినిమా ఇది. ఆయన చుట్టూనే సినిమా తిరుగుతుంది అని అర్థమవుతోంది.
అయితే రామలక్ష్మణులు లాంటి నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్ (Manchu Manoj) మధ్యలో ఆంజనేయుడిలా సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ఉంటాడు అని అర్థమవుతోంది. ముగ్గురు స్నేహితులు, ఊరు దేవాలయం భూములు, గ్రామ రాజకీయాలు.. ఇలా మనకు తెలిసిన పాత విషయాలే ఉన్నా.. వాటిని చూపించే విధానమే ఈ సినిమాలో కొత్తగా ఉండబోతోంది. అంతా చెప్పి ఒరిజినల్ సంగతి చెప్పపోతే బాగుండదు కదా. ఈ సినిమా ఒరిజినల్ ‘గరుడన్’. సూరి, శశి కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో తమిళంలో తెరకెక్కిన సినిమా ఇది.
గతేడాది మే 31న తమిళనాట విడుదలై మంచి విజయం అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి రూ.44 కోట్ల వసూళ్లు అందుకుంది. ఇప్పుడు తెలుగులో మన నేటివిటీ అంశాలు, మాస్ – యాక్షన్‌ను యాడ్ చేసి చూపించబోతున్నారు. ముగ్గురు హీరోలకు, దర్శకుడికి, నిర్మాత కేకే రాధామోహన్‌కు (K. K. Radhamohan) ఈ సినిమా చాలా కీలకం. ఎలా ఉంటుందో తెలియాలంటే ఫిబ్రవరి రావాలి. డేట్ ఇంకా టీమ్ చెప్పాలి.