తెలుగులో ఇలాంటి సినిమాలు కూడా వస్తాయా? వస్తే ఆడతాయా? అనే మాటల్ని బలంగా ఎదుర్కొని నిలిచిన సినిమా ‘జాంబి రెడ్డి’ (Zombie Reddy). తేజ సజ్జా (Teja Sajja) – ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ విజయం అందుకుంది. జాంబీలు లాంటి కాన్సెప్ట్‌లను మన నేటివిటీకి దగ్గరగా రాసుకున్న కథను ప్రేక్షకులు అలరించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌కు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ‘జాంబి రెడ్డి’ సినిమాకు సీక్వెల్ కథను దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే సిద్ధం చేశారని సమాచారం.
Zombie Reddy
అయితే ఆయన ఆ సినిమాకు దర్శకత్వం వహించరని, కేవలం కథ మాత్రమే ఇస్తారని వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు. ప్రశాంత్ వర్మ టీమ్‌లోకి వ్యక్తే ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతారు అని అంటున్నారు. ఇక ఈ సినిమాను సితార నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మిస్తారు అని సమాచారం.
దర్శకుడు ఓకే అయ్యాక ప్రశాంత్ వర్మ కథను తీసుకొని స్క్రిప్ట్‌ను సిద్ధం చేయించేలా ఆలోచన చేస్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అదే జరిగితే సితార బ్యానర్‌లో గతంలో దర్శకత్వ విభాగంలో చేసిన వ్యక్తి దర్శకుడు అవుతారు అనే మాట కూడా వినిపిస్తోంది. ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చాకనే అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు.
తేజ సజ్జా ప్రస్తుతం ‘మిరాయి’ (Mirai) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. మరో నెల రోజులపాటు షూటింగ్ జరగాల్సి ఉంటుందట. ఈ మేరకు నేపాల్‌లో షూటింగ్ పెడతారని చెబుతున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ‘జాంబి రెడ్డి 2’ సినిమా పనులు మొదలవుతాయని చెబుతున్నారు. ఇప్పటికే అనుకున్న ఏ సినిమా మొదలుపెట్టకుండా ఇలా కథలు బయటకు ఇచ్చేస్తూ ప్రశాంత్ వర్మ ఏం చేద్దామని అనుకుంటున్నారో అనే డైలాగ్ వినిపిస్తోంది.