బాలీవుడ్ లో లేడీ కమెడియన్ భారతీ సింగ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా బుల్లితెరపై ఓ షోకి హాజరైన ఈమె ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి, తన తల్లి ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడింది. కొన్ని ఈవెంట్ల నిర్వాహకులు నీచంగా ప్రవర్తిస్తుంటారని.. చేతులతో ఎక్కడెక్కడో తాకడానికి ప్రయత్నిస్తుంటారని చెప్పింది. అది తనకు అసలు నచ్చేది కాదని.. కానీ అనవసరంగా తప్పుగా అనుకుంటున్నానేమో అని తనను తాను సముదాయించుకున్నట్లు చెప్పింది. అయితే ఇదంతా చిన్నతనంలో జరిగింది కానీ ఇప్పుడు దానికోసం ఆలోచిస్తే..
అది ముమ్మాటికీ తప్పే అనిపిస్తోందని.. అలాంటి వారితో ఫైట్ చేయాలనుంది తెలిపింది. మీ పిచ్చి వేషాలను చూస్తూ ఊరుకోమని.. ఇక్కడ నుండి వెళ్లండి అని గట్టిగా చెప్పాలనుందని.. ఇప్పుడైతే ఈ మాటలను ధైర్యంగా అనగలనని.. కానీ చిన్నతనంలో అంత ధైర్యం లేదని చెప్పుకొచ్చింది. తన బాల్యంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకుంది. తన తల్లికి 24 ఏళ్ల వయసులో భర్తకు దూరమైందని.. ఆ సమయంలో అప్పిచ్చిన వాళ్లు ఇంటికొచ్చి అమ్మ చేయి పట్టుకునేవారని..
కొందరైతే భుజం మీద చేయి వేసి మాట్లాడేవారని చెప్పింది. ఆ సమయంలో తన తల్లి ఇంత నీచంగా ప్రవర్తించడానికి సిగ్గు లేదా అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చిందని.. అప్పటివరకు వాళ్లు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విషయం తనకు అర్ధం కాలేదని భారతి ఎమోషనల్ అయింది.