సినిమా చూడటం ఈ రోజుల్లో చాలా కాస్ట్లీ వ్యవహారం అయిపోయింది. టికెట్ రేట్లు ఒక ఎత్తు అయితే, ఇంటర్వెల్ లో తినే స్నాక్స్ రేట్లు ఇంకో ఎత్తు. సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్న ఈ సమస్యపై మెగాస్టార్ చిరంజీవి ఫోకస్ పెట్టారు. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆయన మరోసారి రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది.
చిరు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నిర్మాత సాహు గారపాటి ఈ విషయాన్ని లీక్ చేశారు. సంక్రాంతి పండగ హడావిడి అయిపోయాక, చిరంజీవి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో స్పెషల్ గా భేటీ అవ్వబోతున్నారట. ఇందులో ప్రధాన ఎజెండా టికెట్ ధరలు, థియేటర్లో ఫుడ్ రేట్లేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య మల్టీప్లెక్స్ లకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. కొన్నిసార్లు సినిమా టికెట్ రేట్ కంటే పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేటే ఎక్కువగా ఉంటోంది.
ఫ్యామిలీతో సినిమాకు వెళ్తే బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. ఈ కంప్లైంట్స్ చిరంజీవి దృష్టికి వెళ్లడంతో, ఆయన దీన్ని సీరియస్ గా తీసుకున్నారట. ప్రేక్షకులపై భారం తగ్గించకపోతే లాంగ్ రన్ లో ఇండస్ట్రీకే నష్టమని ఆయన భావిస్తున్నారు. అందుకే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలని మెగాస్టార్ డిసైడ్ అయ్యారు. అటు థియేటర్ యజమాన్యాలకు నష్టం రాకుండా, ఇటు ప్రేక్షకుడికి ఇబ్బంది కలగకుండా మధ్యేమార్గం చూసేలా ఈ చర్చలు ఉంటాయట.
గతంలోనూ టికెట్ రేట్ల ఇష్యూ వచ్చినప్పుడు చిరంజీవి ముందుండి నడిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 14న సినిమా వచ్చాక, ఫ్రీ అయిపోయి ఈ సమస్య మీద పడతారు. మెగాస్టార్ ఎంట్రీ ఇస్తున్నారంటే కచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఉంటుందని, త్వరలోనే రీజనబుల్ రేట్లు వస్తాయని సినీ లవర్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
