హ్యాట్రిక్ హిట్స్ కొట్టాక కొంచం గ్యాప్ తీసుకొని నవీన్ పొలిశెట్టి రచించి, నటించిన సినిమా “అనగనగా ఒక రాజు”. మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చిన్మయి రైటర్ & క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించడం గమనార్హం. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. మరి నవీన్ రెండో హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టగలిగాడో లేదో చూద్దాం..!!

కథ: తాత సరదాలు, సరసాలతో ఆస్తి మొత్తం తగలెయ్యగా.. మనవడు రాజు (నవీన్ పోలిశెట్టి)కి డబ్బు, ఆస్తి లేక గొప్పల కోసం అప్పులు చేసి దానధర్మాలు చేస్తూ జమీందారీ అనిపించుకుంటూ ఉంటాడు. తనకంటే వెధవ అయిన స్నేహితుడు ఒక గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక్కసారిగా కోటీశ్వరుడైపోవడంతో.. తాను కూడా అదే విధంగా ఒక ఐశ్వర్యవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తపిస్తున్న తరుణంలో పెద్దిపాలంలో కోటీశ్వరుడి కూతురైన చారులత (మీనాక్షి చౌదరి)ని ప్లాస్ చేసి మరీ పటాయించి పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే.. శోభనం రోజే రాజు కన్న కలలన్నీ తునాతునకలైపోతాయి.
అసలేం జరిగింది? కోటీశ్వరుడవుదామనుకున్న రాజు ప్రెసిడెంట్ పదవి కోసం ఎలక్షన్స్ లో ఎందుకు నిలబడాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “అనగనగా ఒకరాజు “ కథాంశం.

నటీనటుల పనితీరు: నవీన్ పోలిశెట్టి ఈ సినిమాకి ప్లస్ పాయింట్ మరియు చిన్నపాటి మైనస్ కూడా. ఎందుకంటే.. సినిమా మొత్తాన్ని తన భుజం మీదే మోసేస్తుంటాడు. మాస్ సినిమాలకి ఆ వన్ మ్యాన్ షోలు ఒకే కానీ.. కామెడీ సినిమాల్లో మిగతా పాత్రలు కూడా కామెడీ పండించాల్సిన, పండాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఆ విషయంలో నవీన్ కాస్త తగ్గి మిగతా పాత్రలకి కూడా పంచులు వేయడానికి కొంచం స్పేస్ ఇస్తే బాగుండేది. అయితే.. టైమింగ్ విషయంలో నవీన్ మంచి ఫార్మ్ లో ఉన్నాడు. కొన్ని పంచులు పేలకపోయినా.. నవీన్ టైమింగ్ ని ఎంజాయ్ చేస్తాం. రైటర్ గాను ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది.
మీనాక్షి చౌదరి నటిగానూ మెప్పించింది. సాధారణంగా ఆమెను గ్లామరస్ గా మాత్రమే చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ.. ఈ సినిమాలో ఆమె గ్లామర్ కంటే యాక్టింగ్ కి పెద్ద పీట వేసింది. కామెడీ కూడా బాగా పండించింది.
రావు రమేష్ పాత్ర చిన్నదే అయినా.. మంచి ఇంపాక్ట్ ఉంది. తారక్ పొన్నప్ప స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది కానీ.. అతని క్యారెక్టర్ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది.
చమ్మక్ చంద్ర, రంగస్థలం మహేష్ తదితర కమెడియన్లు హాస్యాన్ని బాగానే పండించారు.

సాంకేతికవర్గం పనితీరు: మిక్కీ జె మేయర్ మ్యూజిక్ లో ఎనర్జీ మిస్ అయ్యింది. ఇలాంటి ఫన్ ఎంటర్టైనర్ కి సింక్ అయ్యే సంగీతం కుదరలేదు. యువరాజ్ సినిమాటోగ్రఫీ వర్క్ & ప్రొడక్ధన్ డిజైన్ టీమ్ కష్టం తెరపై కనిపిస్తుంది. సినిమా లావిష్ గా మాత్రమే కాదు ఆర్గానిక్ గా ఉంటుంది.
దర్శకుడు మారి పనితనం గురించి ప్రస్తుతానికి చెప్పుకోవడానికి పెద్దగా లేదు. దర్శకుడిగా అతడి ఆలోచనాధోరణి ఏంటి? డైరెక్టర్ క్రెడిట్ కాకుండా డైరెక్షన్ క్రెడిట్ ఎంత అనేది తెలియాల్సి ఉంది. అయితే.. డైరెక్షన్ & సీన్ కంపోజిషన్ విషయంలో చాలా లోటుపాట్లు కనిపించాయి. ఆ తప్పులు మారికి ఆపాదించడం కూడా సరికాదు.
రైటర్ & క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి ఫస్టాఫ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ముఖ్యంగా నవీన్ పంచులు చాలావరకు పెద్దగా పేలలేదు. సెకండాఫ్ & క్లోజింగ్ ఎమోషనల్ సీన్స్ సినిమాని గట్టెక్కించాయి.

విశ్లేషణ: ఓ పల్లెటూరు, ఒక హీరో, పెళ్లి గోల, ఎలక్షన్స్ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఒకప్పుడు వినోద్ కుమార్, ఆ తర్వాత అల్లరి నరేష్ ఈ తరహా సినిమాలు చాలా చేశారు. నవీన్ పోలిశెట్టి కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అయ్యాడు. అయితే.. నవీన్ మార్క్ కామెడీ అనేది కాస్త మిస్ అయ్యింది. అతడి మునుపటి సినిమాల్లో ప్రేక్షకులు ఆస్వాదించించే ఆర్గానిక్ కామెడీ. కానీ.. ఈ సినిమాలో ఎక్కువ సింగిల్ లైన్ పంచుల మీద డిపెండ్ అయ్యాడు. అవి చాలా వరకు సరిగా పేలలేదు. ఆ కారణంగా “అనగనగా ఒక రాజు” అనే సినిమా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే.. పండగ సందర్భంగా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సినిమా కావడం ఒక ప్లస్ పాయింట్.

ఫోకస్ పాయింట్: రాజు గారి హడావిడి!
రేటింగ్: 2.5/5
