‘ది రాజాసాబ్'(The RajaSaab) సినిమాపై వస్తున్న ట్రోల్స్ ని ఖండించారు దర్శకులు మారుతీ. వివరాల్లోకి వెళితే.. జనవరి 9న రిలీజ్ అయిన ‘ది రాజాసాబ్’ సినిమాకి ప్రీమియర్ షోలతోనే నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రభాస్ ని దర్శకుడు ప్రెజంట్ చేసిన తీరుపై విమర్శల వర్షం కురిపించింది. ‘పాన్ ఇండియా సూపర్ స్టార్ తో ఇలాంటి సినిమా తీస్తావా?’ అంటూ కామన్ ఆడియన్స్ తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా దర్శకుడు మారుతిని విమర్శించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన ఇంటి అడ్రెస్ ఇచ్చి మరీ అభిమానులకు భరోసా ఇచ్చిన మారుతీని ఓ రేంజ్లో టార్గెట్ చేసి ట్రోల్ చేశారు కొంతమంది నెటిజెన్లు. అయితే టాక్ తో సంబంధం లేకుండా ‘ది రాజాసాబ్’ కి తొలిరోజు భారీ వసూళ్లు వచ్చాయి. దీని పై మారుతీ హర్షం వ్యక్తం చేశారు.ఆ ధైర్యంతోనే అనుకుంట ఈరోజు మీడియాతో మారుతీ ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ” ఈరోజుల్లో ట్రోలింగ్ ఎదుర్కోని పెద్ద సినిమా అంటూ లేదు.

‘ఓజి’ నుండి చూసుకుంటే ‘అఖండ 2’ ‘మన శంకర వరప్రసాద్ గారు’ వరకు అన్ని పెద్ద సినిమాలు ట్రోలింగ్ భారిన పడ్డాయి. ‘ది రాజాసాబ్’ అతీతం ఏమీ కాదు. 3 ఏళ్ళు కష్టపడి ఈ సినిమా తీశాను. 3 గంటలు సినిమా చూసి.. మైక్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగారు చాలా మంది. సోషల్ మీడియాలో చాలా మంది పనిగట్టుకుని ట్రోలింగ్ చేశారు. వాళ్ళు మానసిక ఆనందం పొందారు. నేనైతే వాళ్ళని ఏమీ శపించను. కానీ నేచర్ చూస్తూ ఊరుకోదు.
తర్వాత వాళ్ళు పశ్చాత్తాప్పడతారు. ట్రోల్ చేసిన వాళ్లకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది.. ఒక లైఫ్ ఉంటుంది అని వాళ్ళు తెలుసుకుంటారు. ఓ పెద్ద హీరోని పెట్టుకుని నేను రెగ్యులర్ ఫార్మాట్ ను బ్రేక్ చేసి ఓ కొత్త సినిమా తీశాను. ‘ఆయన ఎవరో తెలుసా’ అని ఫ్లాష్ బ్యాక్ పెట్టి సినిమా తీయగలను. కానీ ప్రభాస్ వంటి కటౌట్ ఉంది కదా అనే ధైర్యంతో ఒక కొత్త అటెంప్ట్ చేశాను. హాస్పిటల్ సీన్ గురించి చాలా మంది గొప్పగా చెబుతున్నారు.
పండగ మూడ్లో ఉండి మా కాన్సెప్ట్ ను సరిగ్గా అర్ధం చేసుకోలేదు. తర్వాత అర్ధం చేసుకుంటారు అనే నమ్మకం నాకు ఉంది. ‘ఖలేజా’ సినిమాని కూడా అప్పట్లో చాలా మంది విమర్శించారు. ఇప్పుడు దానికి కల్ట్ స్టేటస్ ఇచ్చారు. ‘ది రాజాసాబ్’ విషయంలో కూడా అదే జరుగుతుంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మారుతీ.
