మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ‘విశ్వంభర’ సినిమా రిలీజ్ ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.సెప్టెంబర్ 18న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్టు టాక్ అయితే నడుస్తుంది. సోషియో-ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ సినిమాకి ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకుడు. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆ సాంగ్ సినిమాలో వచ్చే స్పెషల్ నెంబర్(ఐటమ్ సాంగ్) అని తెలుస్తోంది.
‘కె.జి.ఎఫ్’ బ్యూటీ మౌనీ రాయ్ ను ఈ స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘అన్నయ్య’ లో ‘ఆట కావాలా పాట కావాలా’ అనే మంచి మాస్ ఐటెం సాంగ్ ఉంటుంది. అదే పాటని ‘విశ్వంభర’ కోసం రీమిక్స్ చేయడానికి రెడీ అయ్యారట.
సినిమాలో ఇది చిరు ఇంట్రో సాంగ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ‘ఆట కావాలా పాట కావాలా’ సాంగ్ రీమిక్స్ ను భీమ్స్ తో కంపోజ్ చేయిస్తున్నారట. ఈ సినిమాకి ఆస్కార్ విజేత, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆయనే సమకూరుస్తున్నారు.
అయితే చిరు కోరిక మేరకు భీమ్స్ తో ఈ ఐటెమ్ సాంగ్ చేయిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం భీమ్స్ ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు. అయితే చిరంజీవి సినిమా కోసం అతను ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా ‘విశ్వంభర’ కోసం పనిచేయబోతున్నాడట. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు చేస్తున్న సినిమాకు కూడా భీమ్స్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.