‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుండి ఇటీవల ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. కొమరం భీమ్ పాత్రధారి ఎన్టీఆర్ ని ముస్లిం గెటప్ లో చూపించడాన్ని చాలామంది తప్పుబట్టారు. దర్శకుడు ఇది ఫిక్షన్ కథ అని చెప్పినప్పటికీ.. కొమరం భీమ్ అని పెట్టడం, ఆ పాత్రను ముస్లిం గెటప్ లో చూపించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికే ఆదివాసీ సంఘాలు రాజమౌళిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.
తమ నాయకుడ్ని కించపరిచేలా తీసిన సన్నివేశాల్ని తొలిగించాలని లేదంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా బీజేపీ ఎంపీ సోయం బాపురావు కూడా రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ లో భీమ్ పాత్ర ధరించిన టాకియాను(ముస్లింలు ధరించే టోపీ) తొలగించాలని సూచించారు. అలా కాకుండా సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగులబెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించేపరిస్తే సహించేది లేదని అన్నారు.
నైజాంకి వ్యతిరేకంగా కొమరం భీమ్ పోరాటం చేసి అమరుడయ్యారని.. భీమ్ ని చంపిన వాళ్ల టోపీ ఆయనకి పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని అన్నారు. ఇప్పటికైనా రాజమౌళి చరిత్ర తెలుసుకొని ప్రవర్తించాలని.. లేదంటే మర్యాదగా ఉండదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వివాదంపై రాజమౌళి స్పందిస్తాడేమో చూడాలి!