నేనే సుపీరియర్.. ఈ మాటను చాలా ఏళ్ల పాట అనుకుని.. ఇప్పుడు బొక్కా బోర్లా పడ్డాక కూడా ‘నేనే సుపీరియర్’ అనే మాటను పట్టుకుని వేలాడుతున్న వాళ్లను మీకు చూడాలని ఉందా? అయితే బాలీవుడ్ జనాలను ఓసారి చూడండి చాలామంది ఇలాంటోళ్లు కనిపిస్తారు. ప్రముఖ తెలుగు నిర్మాత నాగవంశీ దెబ్బకు ఒక్కొక్క బాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాతలు బోరుమంటన్నారు. అలా ఎలా మాట్లాడతారు అని ముఖం చిట్లించుకుంటున్నారు. సీనియర్ నిర్మాత బోనీ కపూర్‌తో నాగవంశీ (Suryadevara Naga Vamsi) మాట్లాడిన తీరు సరిగా లేదు అనేది ఆ సీనియర్ బాలీవుడ్ జనాల మాట.
Naga Vamsi
బయటకు అలా చెబుతున్నా బాలీవుడ్‌ను తక్కువ చేస్తూ నాగవంశీ మాట్లాడారు అనేదే వారి కోపమని అర్థమవుతోంది. బోనీ కపూర్ లాంటి సీనియర్ నిర్మాత పక్కన కూర్చొని ఎగతాళి చేశారు అని గొంతు చించుకుంటోంది బాలీవుడ్. అయితే గతంలో కొందరు బాలీవుడ్ పెద్దలు సౌత్ సినిమాను ఇంతకంటే తక్కువగానే చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పుడు నాగవంశీ చెప్పిన మాటల్ని యాజ్ ఇట్ ఈజ్ కాకపోయినా ఇండస్ట్రీలోని పరిస్థితులు బాలేవని, హీరోలు, నటులు మారకపోతే, మైండ్ సెట్ మార్చుకోకపోతే బాలీవుడ్ ఇంకా ఇబ్బంది పడుతుంది అని ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఇదివరకు ఒకసారి చెప్పారు కూడా.
‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే మలయాళ సినిమాను ఆయన రీమేక్ చేస్తున్నప్పుడు పడ్డ ఇబ్బందుల్ని చెబుతూ ఈ విషయం చెప్పారు అక్షయ్. ఇండస్ట్రీ యాటిట్యూడ్ విషయంలో ఆయన ఎంత ఇబ్బంది పడకపోయి ఉంటే ఆ మాట అంటాడు. ఇక బాలీవుడ్ పరిస్థితిని వివరించాడానికి అక్కడి పరాజయాలు, హిట్లు చూస్తే సరి. వాళ్ల దర్శకుడు చేస్తున్న సినిమాలు తేడా కొడుతుంటే.. మన దర్శకులు వెళ్లి అక్కడ నటులతో చేస్తున్న సినిమాలు విజయం సాధిస్తున్నాయి.
ఇదంతా వాళ్ల నారో మైండ్‌సెట్ వల్లనే అనే విమర్శలూ ఉన్నాయి. ఇంచుమించు నాగవంశీ చెప్పింది కూడా ఇదే. మీరు ముంబయికే పరిమితం అయిపోయారు. మేం ప్రపంచాన్ని చుట్టొస్తున్నాం అని. అయినా తనకు, బోనీ కపూర్‌కు మధ్య జరిగింది కేవలం చర్చ మాత్రమేనని, ఆయనపై తనకు గౌరవం ఉందని నాగవంశీ (Naga Vamsi) చెప్పారు కూడా. కానీ బోరుమంటున్న బాలీవుడ్ ఇంకా సెట్ అవ్వడం లేదు.