‘మైదాన్’.. బాలీవుడ్‌లో ఎన్నో అంచనాలతో విడుదలైన సినిమా ఇది. అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించారు. భారత ఫుట్‌బాల్ దిగ్గజ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా దర్శకుడు అమిత్ శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఊహించని పరాజయం పాలైంది. అంతకుమించిన బాధ ఏంటంటే సినిమా కోసం అనుకున్న బడ్జెట్‌కి దాదాపు రెండింతలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందట. దీంతో నష్టం భారీగా పెరిగిందట. ఈ విషయాన్ని బోనీ కపూరే చెప్పుకొచ్చారు.
‘మైదాన్’ సినిమా షూటింగ్ ప్రారంభించి ఓ 70 శాతం షూటింగ్ అయిపోయాక కరోనా – లాక్‌డౌన్ పరిస్థితులు వచ్చాయి. సినిమాలో కీలకమైన ఫుట్‌బాల్ మ్యాచ్‌ల సన్నివేశాలను 2020 మార్చి చివరిలో షూటింగ్ చేయాలని అనుకున్నారట. దాని కోసం అంతర్జాతీయ టీమ్‌లు కూడా దేశానికి వచ్చాయి. ఆ సమయంలో లాక్‌డౌన్ ప్రకటించారు. విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. దీంతో ఆ క్రీడాకారులందరికీ ముంబయిలోనే వసతి ఏర్పాటు చేశారు బోనీ కపూర్.
ఆ మ్యాచ్‌లను చిత్రీకరించే చేసే సమయంలో సుమారు 800 మంది సెట్స్‌లో ఉండేవారట. వారికి తాజ్ హోటల్ నుండి భోజనం తెప్పించేవారట. కొవిడ్ నిబంధనల ప్రకారం నాలుగు అంబులెన్స్‌లు, వైద్యులను షూటింగ్ స్పాట్‌లో అందుబాటులో ఉంచారు. ఎక్కువ మంది కలసి తినడానికి కుదరదు కాబట్టి మినిమమ్ డిస్టెన్స్ పాటించేవారట. దీంతో ఎక్కువ టెంట్లు ఏర్పాటు చేయాల్సి వచ్చిందట. మంచి నీళ్ల బాటిళ్లకు పెట్టిన డబ్బుతో ఓ చిన్న సినిమాని నిర్మించొచ్చు అని చెప్పారు బోనీ.
సినిమా కోసం ముంబయిలో రూపొందించిన ఫుట్‌బాల్ స్టేడియం సెట్ తుపానుతో కొట్టుకుపోయింది. అలా రూ.120 కోట్ల బడ్జెట్ అనుకుంటే.. సినిమా పూర్తయ్యే నాటికి అది రూ.210 కోట్లు అయింది. ఇలా నానా ఇబ్బందులు పడి ప్రయాణం చేసిన ఈ సినిమా 2024లో విడుదలై ఇబ్బందికర ఫలితం సంపాదించుకుంది. బోనీ కపూర్ పరిస్థితి అర్థం చేసుకున్న చిత్ర బృందంలోని కొందరు పారితోషికంలో 15 శాతం తగ్గించుకున్నారట.