సినిమాల్లో ఎన్నో దశాబ్దాలుగా అలరిస్తున్న ఏకైక ‘నవ్వు’ బ్రహ్మానందం (Brahmanandam). అదేంటి నవ్వు అంటారా? ఆయనను తెరపై చూడగానే మనకు ఠక్కున వచ్చే ఎక్స్‌ప్రెషన్ అదే కాబట్టి అలా అన్నాం. అయితే ఆయన కుటుంబం నుండి నటవారసత్వంగా వచ్చిన తనయుడు రాజా గౌతమ్ మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోవడం లేదు. దీంతో హీరో కెరీర్‌గా ఇంకా ఓ స్థాయికి రాలేదు. ఈ క్రమంలో రాజా గౌతమ్, బ్రహ్మానందం కలసి ఓ స్పెషల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు.
నిజ జీవితంలో తండ్రీకొడుకులు అయిన బ్రహ్మానందం, రాజా గౌతమ్.. ఇప్పుడు వెండితెరపై తాత, మనవడుగా సందడి చేయబోతున్నారు. ‘బ్రహ్మా ఆనందం’ పేరుతోనే రూపొందనున్న ఆ సినిమాను రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా (Rahul Yadav Nakka) నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ ఓ వీడియోను టీమ్ రిలీజ్ చేసింది.
అనౌన్స్ మెంట్ వీడియోను తండ్రి కొడుకులు ఇద్దరూ వెన్నెల కిషోర్‌తో (Vennela Kishore,) కలసి వెరైటీగా చేయించారు. తాత పాత్ర చేయమంటే బ్రహ్మీ వ్యతిరేకించడం, ఆ తర్వాత కాసేపటికి ఒప్పుకున్నాక జరిగే సరదా సంభాషణతో వీడియోను రూపొందించారు. ఇక పట్టణ, గ్రామీణ సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రతిబింబించేలా సినిమా ప్రీలుక్ పోస్టర్‌ని డిజైన్ చేశారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందట.
ఇక సినిమాను ఈ ఏడాది డిసెంబరు 6న విడుదల చేస్తామని కూడా టీమ్ చెప్పేసింది. తన పేరు మీద సినిమా తీయడం అందులో బ్రహ్మానందమే నటిస్తుండటంతో ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది. మరోవైపు ఏకంగా ఏడు నెలల ముందు విడుదల తేదీ చెప్పేయడం కూడా ఆసక్తి కలిగించే విషయమే. ఇక ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన బ్రహ్మానందం ఆ తర్వాత స్పీడ్ తగ్గించారు. సెలెక్టెడ్‌గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో ఈ సినిమా రానుండంటం ఆసక్తికరంగా మారింది.