బాలీవుడ్లో భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో `బ్రహ్మాస్త్ర`కూడా ఒకటి. తెలుగులో ఈ చిత్రం ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదల కాబోతుంది. రణ్‌బీర్ కపూర్, అలియాభట్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారు. అలాగే మౌనీ రాయ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ‘బ్రహ్మాస్త్రం’ కోసం మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించనున్నారు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో.. ఈ చిత్రానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. ఇక ట్రైలర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి డబ్బింగ్ స్టూడియోకి వెళ్లిన వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ‘ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతనే శివ’ అంటూ పవర్ ఫుల్ గా వాయిస్ ఓవర్ ఇచ్చారు చిరు.
ట్రైలర్ మెగాస్టార్ వాయిస్ ఓవర్ తోనే ప్రారంభం అవుతుంది. జూన్ 15 న 5 భాషల్లో ఈ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు అంగీకరించడంతో దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎమోషనల్ అయ్యారు. ఆయన చిరంజీవి కాళ్ళ పై పడిన విజువల్ ను మనం వీడియోలో చూడొచ్చు.
ఇక ‘బ్రహ్మాస్త్రం’ చిత్రం మూడు పార్టులుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే.సెప్టెంబర్ 9న విడుదల కాబోతుంది మొదటి పార్ట్. ‘స్టార్ స్టూడియోస్’, ‘ధర్మ ప్రొడక్షన్స్’, ‘ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.