‘బ్రహ్మాస్త్ర’ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా. అగ్ర నిర్మాతల్లో ఒకడైన కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ రూపొందించారు. ‘బాహుబలి’ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. మూడు భాగాలుగా ఈ సినిమాను తీయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఐదారేళ్ల క్రితం ఈ సినిమాకి సన్నాహాలు మొదలయ్యాయి. స్క్రిప్ట్ వర్క్ కోసం చాలా సమయం తీసుకున్నారు. మేకింగ్ పరంగాను ఎక్కువ టైం తీసుకున్నారు. వందల కోట్ల బడ్జెట్ లో సినిమాను నిర్మించారు.
కేవలం హిందీకి పరిమితం చేయకుండా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. సౌత్ లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. ఇక తెలుగులో ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ కి చిరంజీవితో వాయిస్ ఓవర్ చెప్పించారు. అలా ఇతర భాషల్లో కూడా ఎక్ట్రా కేర్ తీసుకుంటున్నారు. నాగార్జున ఈ ఇసినిమాలో కీలక పాత్ర పోషించడం కూడా సౌత్ లో కలిసొస్తుందని భావిస్తున్నారు. కానీ హిందీ సినిమాలకు నార్త్ మార్కెట్ లో షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
కోవిడ్ తరువాత బాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు చాలానే బోల్తా కొట్టాయి. అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్వీరాజ్’ లాంటి బిగ్ బడ్జెట్ ఫిల్మ్ కూడా పెద్దగా ఆడలేదు. ఈ సినిమా రిజల్ట్ ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ ను టెన్షన్ పెడుతోంది. ఇదివరకు మాదిరి బాలీవుడ్ లో ఏ సినిమా వచ్చినా.. ప్రేక్షకులు చూసేసే పరిస్థితి లేదు. సౌత్ సినిమాలకు బ్రహ్మరథం పడుతూ.. మూస ధోరణిలో వస్తోన్న హిందీ సినిమాలను లైట్ తీసుకుంటున్నారు నార్త్ ఆడియన్స్.
హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా అక్కడి దర్శకులు సినిమాలు తీయలేకపోతున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను ఎంత భారీగా తీసినా.. కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా.. ‘పృథ్వీరాజ్’ లాంటి సినిమాల ఫలితాలు చూశాక మాత్రం చిత్రబృందాన్ని భయం వెంటాడుతుందనడంలో సందేహం లేదు. మరి ఇవన్నీ దాటుకొని సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి!