‘డిజె టిల్లు’ (DJ Tillu) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Squre) సినిమాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నుండి వస్తున్న సినిమా ‘జాక్’ (Jack). ఈ సినిమాకి ‘కొంచెం క్రాక్’ అనేది క్యాప్షన్. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ‘ఎస్.వి.సి.సి’ బ్యానర్ పై బాపినీడు నిర్మిస్తున్నారు. భోగవల్లి ప్రసాద్ (B. V. S. N. Prasad) సమర్పకులు. ‘బేబీ’ (Baby) ఫేమ్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ నరేష్ (Naresh) వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘టిల్లు స్క్వేర్’ తో సిద్ధు వంద కోట్ల క్లబ్లో చేరాడు కాబట్టి.. ‘జాక్’ పై మంచి అంచనాలే ఉన్నాయి.
ముఖ్యంగా ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా నిత్యం హాట్ టాపిక్ అవుతుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. విషయంలోకి వెళితే.. ‘జాక్’ సినిమాని ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టు టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ పార్ట్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉందట. ఇప్పటికీ హడావిడిగా షూటింగ్ జరుపుతూనే ఉన్నారట. మరోపక్క ఈ సినిమాకి బడ్జెట్ కూడా పెరిగిపోయినట్టు టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాని రూ.30 కోట్ల బడ్జెట్లో కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల.. దీని లెక్క రూ.35 దాటేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. సిద్ధుకి మార్కెట్ ఉంది కాబట్టి.. రికవరీకి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ షూటింగ్ పార్ట్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉండడం వల్ల టీం కంగారు పడుతున్నట్టు వినికిడి. ఇక ‘జాక్’ టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. కానీ అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ట్రైలర్ తో ఏమైనా బజ్ పెంచే ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి.