తెలుగు సినిమా పరిశ్రమలో కార్పొరేట్ బల్క్ బుకింగ్స్ ఓ సాధారణ అంశంగా మారిపోయింది. పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా… రిలీజ్ దశలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాలంటే ముందే బల్క్ బుకింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ షో గేమ్ ద్వారా భారీ ఓపెనింగ్స్, రికార్డులు అనే మాటలు వినిపించాలనే ఉద్దేశంతో బుకింగ్స్ పెడుతున్నారు. ఈ ట్రెండ్ వెనుక మరో కారణం కూడా ఉంది. ఓటీటీ డీల్స్‌పై ప్రభావం చూపేందుకు ఈ బల్క్ బుకింగ్స్ ఉపయోగపడుతున్నాయి.
గతంలో ఓటీటీ హక్కులు రిలీజ్‌కు ముందే ఫిక్స్ అయ్యేవి. కానీ ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్లు ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి చెల్లింపులు జరుగుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర నంబర్స్ బాగుంటేనే ఓటీటీ డీల్ పూర్తిగా క్లోజ్ అవుతోంది. దీంతో నిర్మాతలు మొదటి వారంలో బల్క్ బుకింగ్స్ ద్వారా వసూళ్లు పెంచాలని చూస్తున్నారు. ప్రైమ్ థియేటర్స్‌లో ప్రైవేట్ కంపెనీలు, స్పాన్సర్స్ పేరుతో టికెట్లు తీసి హై నంబర్స్‌ను చూపిస్తున్నారు. అయితే ఇది నిర్మాతలకు ( Producers) కాస్త తలనొప్పిగా మారింది.
ఎందుకంటే ఈ ముందస్తు బుకింగ్స్‌కి వారికి కోట్లు ఖర్చవుతున్నాయి. మార్కెట్‌లో హైప్ కోసం పెట్టిన డబ్బు రాబడిగా రావాలంటే కష్టమే. అయితే హీరోలు, హీరోయిన్లకు మాత్రం ఇది ప్లస్ అవుతోంది. బాక్సాఫీస్ నంబర్స్ బలంగా కనిపించడంతో వారి క్రేజ్ పెరుగుతోంది. తద్వారా వారి రేట్ పెరుగుతుంది. రాబోయే సినిమాల డీల్ విలువలు కూడా పెరిగిపోతున్నాయి. సో, నిర్మాతలు ( Producers) బరువు మోస్తే.. స్టార్ నటీనటులు మేలే పొందుతున్నారు. ఇప్పటికైనా ఈ ట్రెండ్‌పై పరిశ్రమలో చర్చ మొదలవాలి.