బుల్లెట్ భాస్కర్ (Bullet Bhaskar) అందరికీ సుపరిచితమే. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యాడు ఇతను. ఆ షోలో మహేష్ బాబుని ఇమిటేట్ చేస్తూ ఎక్కువగా హైలెట్ అయ్యేవాడు. ఓ ఇంటర్వ్యూలో అయితే మహేష్ బాబుకి పలుమార్లు డబ్బింగ్ కూడా చెప్పినట్లు తెలిపి షాకిచ్చాడు. ఇటీవల ఇతను పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా గురించి, తన స్ట్రగుల్ గురించి చెప్పి షాకిచ్చాడు. బుల్లెట్ భాస్కర్ (Bullet Bhaskar) మాట్లాడుతూ… “సోషల్ మీడియాలో ఉండటం… బట్టలిప్పి రోడ్డు మీదకు రావడం.. ఈ రెండూ ఒక్కటే.
వీటివల్ల అందరూ మనల్ని ప్రశ్నిస్తారు. మన జవాబు నచ్చకపోతే విమర్శిస్తారు. ఊరికే ఒకరితో అనిపించుకోవడం ఎందుకు? అందుకే నాకు చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టమని సలహా ఇచ్చినా… నేను వాటి జోలికి పోలేదు. నాకు, నా కుటుంబానికి ప్రైవసీ అవసరం అని నేను భావిస్తాను. అందుకే నా ఫ్యామిలీని మీడియా ముందుకు తీసుకురాను. ఇక గుర్తింపు తెచ్చే పాత్రలు రావట్లేదు కదా అని గుంపులో గోవింద వంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం ఉండదు.
25 నిమిషాల పాటు గ్యాప్ లేకుండా నేను (Bullet Bhaskar) నటించగలను. అందుకే నేను చిన్న, చితక పాత్రలతో సంతృప్తి చెందలేను. నేను కొంతమందికి కథలు చెప్పాను.వాళ్లలో కొంతమంది మార్పులు చేసి సినిమాలు తీసేశారు. అందులో ఒకటి, రెండు హిట్ అయ్యాయి కూడా. కచ్చితంగా భవిష్యత్తులో సినిమాని డైరెక్ట్ చేసి విజయం సాధించగలననే నమ్మకం నాకు ఉంది. ఇప్పుడైతే ఆర్థికంగా స్థిరపడటంపై దృష్టి పెట్టాను. ఈవెంట్లు, షోల ద్వారా అది సాధ్యం కాదు”.. అంటూ చెప్పుకొచ్చాడు.