పరభాషా నటులు తెలుగు రాష్ట్రాలకు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి రావడం అనేది రెగ్యులర్ గా జరిగే విషయమే. అయితే.. వచ్చినవాళ్లందరికీ తెలుగు రాదు కాబట్టి “అందరికీ నమస్కారం” అని చెప్పి తర్వాత వాళ్లకు వచ్చిన భాషలో కంటిన్యూ అవుతారు. ఇంకొందరు తెలుగు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. రీసెంట్ గా “రిటర్న్ ఆఫ్ ది డ్రాగర్” సినిమా హైదరాబాద్ ప్రమోషనల్ ఈవెంట్ కోసం వచ్చిన ప్రదీప్ రంగనాథ్.. తన స్పీచ్ మొత్తాన్ని తెలుగులోనే మాట్లాడడం అనేది ఎంతటి చర్చనీయాంశం అయ్యిందో తెలిసిందే.
ఒక భాషకి, ప్రాంతానికి ఇచ్చే కనీస స్థాయి గౌరవం అది. అలాంటిది.. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అత్యంత ఘనంగా జరిగిన “కాంతార చాప్టర్ 1” ఈవెంట్లో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి (Rishab Shetty) ఒక్క ముక్క తెలుగు మాట్లాడకపోవడం రాద్ధాంతానికి దారి తీసింది. ఆయన సతీమణి కూడా వచ్చీరాని తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంది కానీ.. రిషబ్ మాత్రం శుద్ధమైన కన్నడలో మాట్లాడేసి వెళ్ళిపోయాడు.
ఈ విషయాన్ని ఎవరు సహించారు? ఎవరికి సహించడం లేదు? అనే విషయం పక్కన పెడితే.. తన సినిమాని పరాయి భాషలో ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిన హీరోకి కనీసం నమస్కారం అని తెలుగులో చెప్పే ఆలోచన రాకపోవడం బాధాకరం. అలాగని రిషబ్ కి (Rishab Shetty) తెలుగు రాదా అంటే కాదు. “కాంతార” ప్రమోషన్స్ లో చక్కగా తెలుగులో మాట్లాడాడు. భాషాభిమానం కచ్చితంగా ఉండాల్సిందే.. మరి ఆ భాషాభిమానం లేనిది మన తెలుగు వాళ్ళకేనేమో.
ఇప్పుడు రిషబ్ (Rishab Shetty) ఒకవేళ తెలుగులో వీడియో రిలీజ్ చేసినా పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. తెలుగు మార్కెట్ కావాలి, తెలుగు నిర్మాతల నుండి సపోర్ట్ కావాలి, తెలుగు ప్రేక్షకుల నుండి డబ్బులు కావాలి కానీ.. తెలుగు భాష మాత్రం వద్దు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే తెలుగోళ్లు అంటూ మిగతా భాషల వాళ్లు చిన్నచూపు చూడడం ఖాయం.