ఎంత భారీ బడ్జెట్ తో సినిమా తీసినా.. ఎంత మంచి కధైనా… అంతెందుకు సినిమా ఎంత వేగంగా తీసినా… ఆ చిత్రానికి సెన్సార్ పూర్తవ్వకపోతే విడుదలకు నోచుకోదు. అది ఏ భాష చిత్రమైనా సరే. సినీపరిశ్రమ పుట్టినప్పటి నుండీ సెన్సార్ ఉంది. వయలెన్స్ ఎక్కువైనా.. రొమాన్స్ శృతిమించిన సెన్సార్ వేటు తప్పదు. ఒకవేళ ఆ చిత్రంలో వివాదాస్పద అంశాలు ఉన్నా, వివాదాలు సృష్టించే విధంగా ఆ చిత్రం యొక్క కథ, కథనాలు ఉన్నా… ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి సెన్సార్ బోర్డు అంగీకరించదు.
సినిమా షూటింగ్ పూర్తయ్యి కూడా సెన్సార్ పూర్తవ్వని కారణంగా విడుదలకు నోచుకోని చిత్రాల పై ఓ సర్వే నిర్వహించగా… దాదాపు 800 చిత్రాలను సెన్సార్ బోర్డు తిరస్కరించినట్టు తెలుస్తుంది. ఇందులో మన భారతీయ చిత్రాలే 586 ఉండగా విదేశీ చిత్రాలు 207 వరకూ ఉన్నాయి. వీటిలో బాలీవుడ్ చిత్రాలు 231, కోలీవుడ్ చిత్రాలు 96, టాలీవుడ్ చిత్రాలు 53, కన్నడ చిత్రాలు 39, పంజాబీ చిత్రాలు 17… ఉండటం గమనార్హం. ఈ చిత్రాలకి సెన్సార్ బోర్డు మొండి చెయ్యి చూపించడానికి కారణం… అస్లీలత ఎక్కువగా ఉండడం, రాజకీయ నాయకులని విమర్శించే అంశాలు ఉండటం, మితి మీరిన హింస, యువతను రెచ్చగొట్టే కథలు… వంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇక నుండీ సినిమాలను రూపొందించే దర్శక నిర్మాతలు .. పై విషయాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగడం ఉత్తమం అని చెప్పడంలో సందేహం లేదు.