Champion : మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో అందాల భామ అనశ్వర రాజన్ ఒకరు. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెమెరా ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ, తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. చిన్నప్పటి పాత్రల నుంచే మొదలైన ఆమె ప్రయాణం, అవార్డులు & అభినందనలతో నిండిన హీరోయిన్ కెరీర్‌గా మారింది. ఈరోజు మలయాళంలో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అనశ్వర పేరే ఎక్కువగా వినిపిస్తుంది.
ఇప్పుడీ అమ్మడు తెలుగులోనూ తన అదృష్టం పరీక్షించుకుంటోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటిస్తున్న ఛాంపియన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్లలో అనశ్వర కూడా చురుగ్గా పాల్గొంటోంది. వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన అందానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇన్నేళ్లుగా మేకప్, లైట్స్ మధ్య పనిచేస్తున్నా చర్మాన్ని కాపాడుకోవడం తనకు అలవాటైపోయిందని చెప్పింది. షూటింగ్ పూర్తయిన వెంటనే మేకప్‌ను పూర్తిగా తొలగించడం, రోజులో సాధ్యమైనంత వరకు ఎక్కువగా నీరు తాగడం తన బ్యూటీ రూటీన్‌లో చాలా ముఖ్యమని వెల్లడించింది. “చర్మం డ్రైగా కాకుండా ఉండాలంటే క్లీన్ చేసిన తర్వాత లోషన్ తప్పనిసరి” అంటూ సింపుల్ కానీ ఎఫెక్టివ్ సీక్రెట్స్ చెప్పింది. అలాగే ఫ్రెష్ జ్యూసులు ఎక్కువగా తీసుకుంటే స్కిన్‌లో నేచురల్ గ్లో కనిపిస్తుందని చెప్పుకొచ్చింది.
ఛాంపియన్ మూవీలో చంద్రకళ అనే పాత్రలో కనిపించనున్న అనశ్వర, అచ్చమైన తెలుగమ్మాయిగా, ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటానని చెబుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలే ఉన్నాయి. విడుదల తర్వాత అనశ్వరకు తెలుగు మార్కెట్‌లో ఎలాంటి క్రేజ్ వస్తుందో చూడాలి.