ఎన్నో భారీ చిత్రాలను కాదని.. ఈ ఏడాది ఆస్కార్ పురస్కాల రేసులో ఉత్తమ విదేశీ చిత్రంగా భారత్ ‘ఛెల్లో షో’ను పంపించింది. ఈ గుజరాతీ సినిమా గొప్పతనం గురించి ఓవైపు చెబుతుంటే.. మరికొందరేమో మన సినిమాలు ఏం తక్కువ అని అడుగుతున్నారు. ఈ చర్చ కాసేపు పక్కన పెట్టేస్తే.. అసలు ఆ సినిమాలో ఏముంది, కథేంటి, ఎలా తీశారు అని కొంతమంది ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిలో మీరు కూడా ఉంటే.. మీకు గుడ్ న్యూస్.
ఆ సినిమాను తక్కువ ధరకే చూపించాలని టీమ్ నిర్ణయించందట. ప్రతిష్ఠాత్మక 95వ అకాడెమీ అవార్డుల చిత్రోత్సవాల్లో బరిలో ఉన్న మా సినిమాపై భారతీయ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాను ‘లాస్ట్ ఫిల్మ్ షో’గా గురువారం దేశంలోని ముఖ్యమైన నగరాల్లో 95 థియేటర్లలో విడుదల చేస్తున్నాం అని టీమ్ ఇటీవల ప్రకటించింది. అంతేకాదు సినిమా టికెట్ ధరను రూ.95గా నిర్ణయించినట్లు కూడా టీమ్ చెప్పింది. ఈ మేరకు దర్శకుడు పాన్ నళిన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇక ఈ సినిమా కథ చూస్తే… సినిమాలంటే తీవ్రంగా అభిమానించే ఓ తొమ్మిదేళ్ల కుర్రాడి కథే ‘ఛెల్లో షో’ / ‘లాస్ట్ ఫిల్మ్ షో’. దర్శకుడు నళిన్ స్వీయ అనుభవాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రాయ్ కపూర్ ఫిల్మ్స్, జుగాడ్ మోషన్ పిక్చర్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రత్యేక షోను (రాత్రి 10:40) గురువారానికి మాత్రమే పరిమితం. హైదరాబాద్‌లో కూకట్‌పల్లి నెక్సస్ పీవీఆర్ మాల్‌లో వేస్తున్నారు.
అయితే ఇప్పుడు బుక్‌మై షోలో చూస్తే ఫుల్ అని వస్తోంది. మరి ఈ రోజు, రేపు ఉదయం ఏమన్నా షోలు పెంచుతారా? లేక ఒక్క షోకే పరిమితం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ సినిమాను హైదరాబాద్‌లో ఒక్క షో వేయడం ఏంటో తెలియడం లేదు. అలా అని 14వ తేదీ (నిజానికి ఈ రోజు సినిమా రిలీజ్) షోలు పడతాయా అంటే.. బుకింగ్స్‌లో కనిపించడం లేదు.