‘విశ్వంభర’ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా అక్టోబరులో వస్తుందని, కాదు నవంబరులో వస్తుందని.. కాదు కాదు వచ్చే ఏడాదే సినిమాను తీసుకొస్తారు అని కూడా కొందరు అన్నారు. సినిమా అంతా రెడీ అయిపోయింది అన్ని నెలలు ఎందుకు పడుతుంది అని ప్రశ్నలు వచ్చాయి. అయితే ఆఖరి ఆప్షన్‌ను నమ్మిన వారే గెలిచారు. అవును సినిమాను వచ్చే ఏడాదికి మార్చేశారు. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా లీక్ చేశారు.
‘విశ్వంభర’ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చేలా ‘విశ్వంభర’ సినిమా టీమ్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో సినిమా గురించి, ఆలస్యం గురించి, కాన్సెప్ట్ గురించి చిరంజీవి వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా సెకండాఫ్ మొత్తం విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌తో నిండి ఉంటుందని.. ఆ పనిని ఎంతో శ్రద్ధగా చేయాల్సి వస్తుందని.. దీని కోసం దర్శకుడు మల్లిడి వశిష్ట, నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కష్టపడుతోందని.. మంచి అవుట్‌పుట్‌తో సినిమాను రెడీ చేస్తామని తెలిపారు.
ఆయన మాటలు వింటున్నప్పుడు సినిమా మరో నెల ఆలస్యమవ్వొచ్చు అని అనిపించింది. అయితే ఆయన లీక్ అంటూ షాక్ ఇచ్చారు. సినిమాను 2026 సమ్మర్‌లో విడుదల చేసేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అంటే ఏ ఏప్రిల్ కానీ, మే కానీ అవ్వొచ్చు. ఎందుకంటే ఆ క్లారిటీ అయితే ఇవ్వలేదు. ‘విశ్వంభర’ సినిమా చందమామ కథలా ఉంటుంది. ఈ సినిమా విడుదలలో జాప్యం సముచితమని నేను భావిస్తున్నాను. ఎలాంటి విమర్శలకు చోటివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు.
సినిమా టీజర్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఏ మాత్రం బాలేవు అని అందరూ పెదవి విరిచారు. ఇక ‘హరి హర వీరమల్లు’ సినిమా విషయంలో వీఎఫ్‌ఎక్స్ విషయంలో చెడ్డ పేరు వచ్చింది. దీంతో ఈ సినిమా విషయంలో అలాంటి ఇబ్బంది రాకుండా ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకోవాలి అని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల చిరంజీవి వీఎఫ్‌ఎక్స్ చూసి ఓకే చేశారని వార్తలొచ్చాయి. అయితే ఈ ఆలస్యం లీక్ వల్ల ఆయన ఓకే చేయలేదు అని క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా గ్లింప్స్‌ను ఆగస్టు 21 సాయంత్రం 6.06కు విడుదల చేస్తున్నారు.