ఇండియన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం అక్కర్లేదు. ఏలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి చిరంజీవి. ఆరు పదుల వయసులో కూడా కుర్రాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి దిగ్గజాలు సీనియర్లుగా మారుతున్న తరుణంలో చిరంజీవి సినిమాలకు ఎంట్రీ ఇచ్చారు. ఇయన దాదాపు 150 సినిమాలకు పైగా నటించారు.
అయితే చిరంజీవి అనగానే తెలుగు సినిమాలే అనుకుంటారు.
కానీ చిరంజీవి బీటౌన్ లో కూడా సినిమాలు చేశారనేది నేటి తరంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు..అయితే ఆయన నటించిన బాలీవుడ్ సినిమాలన్ని కూడా సూపర్ హిట్ కొట్టాయి. కానీ ఎందుకో తరువాత బాలీవుడ్ లో చిరంజీవి సినిమాలు చేయలేదు. మరి దీనికి కారణమేంటి? ఎందుకు? హిట్టయిన సినిమాలేంటి? ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. తన అద్భుతమైన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న చిరంజీవి మాత్రం బాలీవుడ్‌లో తక్కువ సినిమాల్లోనే నటించారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి బీటౌన్ చిత్రాల్లో ఎక్కువగా ఎందుకు కనిపించలేదన్నది చాలా మందికి సందేహం. అయితే, చిరు పరిశ్రమకు వచ్చిన కొత్తల్లోనే ఆయనకు బాలీవుడ్ అవకాశాలు చాలా వచ్చాయి. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా చెప్పారు. 1990లో చిరంజీవి ‘ప్రతిబంధ్’ అనే హిందీ సినిమాలో నటించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది.
ఆ తర్వాత 1991లో తెలుగులో సూపర్ హిట్ అయిన ‘గ్యాంగ్ లీడర్’ను ‘ఆజ్ కా గుండా రాజ్’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఇదీ కూడా విజయాన్ని సాధించింది. ఆ తర్వాత తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జెంటిల్‌మ్యాన్’ సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఇదే ఆయన నటించిన చివరి హిందీ చిత్రం. ఆ తర్వాత చిరంజీవి బాలీవుడ్‌లో సినిమాలు చేయలేదు.
‘అప్పటి అగ్ర దర్శకులు మనోహన్ దేశాయ్, ప్రకాశ్ మెహ్రా, సజిత్ నదియావాలా నాకు చాలా కథలు వినిపించారు. అయితే, అవి నన్ను ఆకట్టుకోలేదు. కథ బాగుంటే కచ్చితంగా చేసేవాడిని. సినిమాకు కథే బలం. నాకు నచ్చిన కథలు వచ్చినట్లైతే చేస్తాను’ అని చిరంజీవి గతంలో ఓ సందర్భంలో చెప్పారు.అంటే.. కథలలో బలం లేక పోవడంతోనే బాలీవుడ్‌కు (Chiranjeevi) చిరు గుడ్ బై చెప్పారన్నమాట.