సాధారణంగా ఏ పెద్ద హీరో సినిమా అయినా శుక్రవారం రిలీజ్ ప్లాన్ చేసుకుంటారు. వీకెండ్ కలెక్షన్స్ మీద కన్నేస్తారు. కానీ మెగాస్టార్ చిరంజీవి రూటు వేరు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్’ ను జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. క్యాలెండర్ చూస్తే అది సోమవారం. మామూలు టైమ్ లో అయితే ఇది పెద్ద రిస్క్, కానీ ఇప్పుడు మాత్రం ఇది ఒక పక్కా బాక్సాఫీస్ మాస్టర్ ప్లాన్.
మేకర్స్ ఈ డేట్ ను ఎంచుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచే మొదలవుతాయి. జనం అప్పటికే పండగ మూడ్ లోకి వెళ్లిపోతారు. 14న భోగి, 15న సంక్రాంతి. ఈ హడావుడికి రెండు రోజుల ముందే, అంటే 12వ తేదీన సినిమాను దింపడం వల్ల.. ఓపెనింగ్స్ తో పాటు వరుసగా వారం రోజుల పాటు హౌస్ ఫుల్ బోర్డులు పడే అవకాశం ఉంది.
నిజానికి సంక్రాంతికి ఆడియన్స్ కోరుకునేది హెవీ యాక్షన్, వైలెన్స్ కాదు. కాసేపు హాయిగా నవ్వుకునే ఎంటర్టైన్మెంట్. సరిగ్గా అనిల్ రావిపూడి బలం కూడా అదే. చిరంజీవి లాంటి మెగాస్టార్ కు అనిల్ మార్క్ కామెడీ తోడైతే థియేటర్లలో నవ్వుల జాతర ఖాయం. పండగకు ఫ్యామిలీస్ మొత్తం కలిసి వెళ్ళే సినిమాగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో అసలైన స్పెషల్ ప్యాకేజీ విక్టరీ వెంకటేష్. ఆయన ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. చిరు, వెంకీ, నయనతార.. ఇలా స్టార్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో ఉంటే ఆ కలరింగ్ వేరు. కేవలం స్టార్ డమ్ మీదే కాకుండా, కంటెంట్ పరంగా కూడా ఫుల్ మీల్స్ పెట్టడానికి సిద్ధమయ్యారు. అందుకే ఈ డేట్ ను లాక్ చేసుకున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, సాహు గారపాటి నిర్మాణ విలువలు సినిమాకు అదనపు ఆకర్షణ. ఇప్పటికే పాటలు జనాల్లోకి వెళ్లాయి.
పోటీలో ఎన్ని సినిమాలు ఉన్నా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ఉండే డిమాండ్ వేరు. ఆ అడ్వాంటేజ్ ను వాడుకోవడానికే జనవరి 12 డేట్ ను ఫిక్స్ చేశారు. మొత్తానికి 7 రోజుల లాంగ్ వీకెండ్ టార్గెట్ గా చిరు బరిలోకి దిగుతున్నారు. మొదటి షో పడి పాజిటివ్ టాక్ వస్తే, సంక్రాంతి విన్నర్ రేసులో మెగాస్టార్ అందరికంటే ముందుండటం ఖాయం. ఈ మాస్టర్ ప్లాన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
