“నాగ్ అశ్విన్ యంగ్ డైరెక్టర్. తన తొలి సినిమా బాగుంది. కానీ తన అనుభవంతో ఈ సినిమా ఎలా చేయగలడని మీమాంస నాలో ఉంది. ఎంతవరకూ దీనికి న్యాయం చేయగలడని సందేహాలుండేవి. కానీ సినిమా చూసిన తర్వాత నా అనుమానాలు పటాపంచల్ అయిపోయాయి. సినిమా చూస్తున్నంత సేపు హృదయం బరువెక్కింది. కళ్లు చెమర్చాయి. అద్భుతంగా చేసి నాగ్ అశ్విన్ శెభాష్ అనిపించాడు. కథ పై ఎంత రీసెర్చ్ చేశాడో సినిమా చూస్తే అర్ధమవుతుంది. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని, కీర్తిని పెంచినవాడు అయ్యాడు. జాతీయ, అంతర్జాతీయంగా తెలుగు పరిశ్రమ మరో పెక్కి ఎక్కింది. ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి కథలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. సావిత్రి గారు ఎంత అందంగా ఉన్నారు? ఆమె చిన్నప్పటి బాల్యం? స‌్టార్ అయిన తర్వాత ఆమె పరిస్థితులు? తర్వాత ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కున్నారు? అనేది అద్భుతంగా చూపించారు. అది దర్శకుడి ప్రతిభకు నిదర్శనం.
సినిమా ప్రారంభం నుంచి ఎండిగ్ వరకూ చాలా అందంగా..అద్భుతంగా చూపించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించడం అనడం కంటే జీవించింది అనడం కరెక్ట్. సినిమా లోకి వెళ్లే కొద్ది సావిత్రిని చూస్తున్నట్లు అనిపించి. దుల్కార్ సల్మాన్ జెమిని గణేష్ గారిలానే అద్భుతంగా నటించారు. ఆయనతో కలిసి రుద్రవీణ చేసాను. ఇలా ప్రతీది ఈ సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఈసినిమాకు బాగా కనెక్ట్ అయ్యాను. మే 9న నా `జగదీకవీరుడు అతిలోక సుందరి` సినిమా రిలీజైంది. అదే రోజున `మహానటి` కూడా రిలీజైంది. అనుకోకుండా జరిగిందో…కావాలని అలా ప్లాన్ చేసారో? తెలియదు గానీ! చాలా సంతోషంగా ఉంది. అందుకు మహానటి టీమ్ అందర్నీ అభినందిస్తున్నా” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు చిరంజీవి. అదే సమయంలో చిరంజీవి నాగఅశ్విన్ దర్శకత్వంలో నటించాలని ఉందని, అతడి దర్శకత్వంలో పాతాళ భైరవి లాంటి సినిమా చేయాలని తన అభిలాషను మీడియా సాక్షిగా బయటపెట్టారు చిరంజీవి. మరి నాగఅశ్విన్ ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకొని చిరంజీవి కోసం కథ రాయడం మొదలెడతాడేమో చూడాలి.