‘ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేయండి.. విశాఖపట్నంలో మీకు స్థలాలు ఇస్తా, ఇల్లు కట్టుకోండి’.. ఈ మాటలు మీకు గుర్తున్నాయా? గతేడాది సంక్రాంతి సందర్భంగా సినిమాలు విడుదల చేసే సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను తెలుగు సినీ పెద్దలు కలిసినప్పుడు అన్న మాటలవి. అయితే ఆ తర్వాత మళ్లీ దాని గురించి ఎక్కడా ఎవరూ స్పందించలేదు. దీంతో జగన్ మాటల్ని సినీ పెద్దలు వదిలేశారా అని చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ సమయంలో త్వరలో విశాఖపట్నంలో సెటిల్ అవుతా అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
విశాఖపట్నంలో త్వరలో సెటిల్ అవుతున్నా.. అంటూ ఆదివారం రాత్రి చిరంజీవి వైజాగ్‌లో చెప్పారు. ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎప్పటినుండో వైజాగ్‌లో ఇల్లు కట్టుకోవాలని ఉంది. ఆ కోరిక ఇప్పుడు తీరబోతోంది అని చిరంజీవి అన్నారు. అయితే చిరంజీవికి భీమిలి బీచ్ దగ్గర పెద్ద స్థలం ఉంది. ఇప్పుడు అక్కడే ఇల్లు కట్టుకోబోతున్నాడని టాక్. సినిమాల నుండి రిటైర్ అయిన తర్వాత విశాఖలో సెటిల్ కావాలని చిరు తన స్నేహితులు, శ్రేయోభిలాషులకు చెబుతుండేవారట.
ఇప్పుడు అదే విషయాన్ని విశాఖపట్నంలో చెప్పారు. అయితే ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది. అయితే చిరంజీవి మాటలు చూస్తుంటే త్వరలోనే ఇంటికి పునాది వేస్తారు అని అర్థమవుతోంది. అయితే దీనికి, అప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘విశాఖ పిలుపు’నకు సంబంధం ఉందా? లేదా? అనేది తెలియడం లేదు. ఏదైతేనేం చిరంజీవి ఇలా ఫస్ట్ స్టెప్ వేస్తే మిగిలిన హీరోలు కూడా ఇటువైపు వస్తారేమో చూడాలి.
అన్నట్లు చిరంజీవికి వైజాగ్‌లో స్టూడియో కట్టాలన్న కోరిక ఉండేది. అప్పట్లో స్థల సేకరణ కూడా మొదలైంది. కానీ వివిధ కారణాల వల్ల ఆ ఆలోచన ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు ఇల్లు కట్టుకుని వచ్చాక.. ఆ ఆలోచన ఏమన్నా చేస్తాడేమో చూడాలి. అయితే ఇప్పుడు జగన్ గవర్నమెంట్ చిరుకి స్టూడియో కోసం విశాఖలో స్థలం కేటాయించబోతోందని అంటున్నారు. ఏపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పనులు త్వరలో ప్రారంభం అనే మాటలూ వినిపిస్తున్నాయి.