ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్క్ శంకర్‌కు అక్కడ చికిత్స జరుగుతోంది. ఈ క్రమంలో మార్క్ శంకర్‌ను చూసేందుకు పవన్ కల్యాణ్‌తో పాటు చిరంజీవి (శివశంకర్ వరప్రసాద్) దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఈ ముగ్గురూ సింగపూర్ బయలుదేరి.. కాసేపటికి క్రితం చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
సమ్మర్ క్యాంప్‌లో భాగంగా మార్క్ శంకర్‌ను సింగపూర్‌లోని ఓ కుకింగ్ స్కూలుకు పంపిస్తున్నారు. రోజు వెళ్లేలాగే మంగళవారం ఉదయాన్నే మార్క్ స్కూలుకు వెళ్లాడు. అయితే అక్కడ ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో మార్క్ కాలు, చేతులకు కాలిన గాయాలయ్యాయి. దాంతోపాటు పొగను పీల్చేయడంతో ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా చేరుకుంది. ప్రస్తుతం మార్క్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అవసరమైన టెస్టులు కూడా చేస్తున్నారు.
ప్రమాద ఘటనపై పవన్ కల్యాణ్ మంగళవారం రాత్రి స్పందించారు. సమ్మర్ క్యాంప్‌లో అగ్నిప్రమాదం జరిగి నా చిన్న కుమారుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. తొలుత అగ్నిప్రమాదం చిన్నదే అనుకున్నా.. తర్వాత దాని తీవ్రత తెలిసింది. అయితే నా పెద్ద కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజు నాడే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరం. అయితే మార్క్ ఆరోగ్యం నిలకడగా ఉందని పవన్ చెప్పారు.
సింగపూర్‌లోని రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ 2, 3 అంతస్తుల్లో మంటల్లో చిక్కుకున్నాయి. ఇదే భవనంలో టొమాటో కుకింగ్ స్కూల్‌లో మార్క్ శిక్షణ పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది గాయపడ్డారని, వీరిలో 15 మంది పిల్లలని సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది.