ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. సింగపూర్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని సమాచారం. ప్రమాద సమయంలో ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం బాలుడికి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు.
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ పర్యటన ముగించి సింగపూర్ వెళ్లనున్నారు. తనయుడు అగ్నిప్రమాదంలో గాయాలపాలయ్యాడని తెలిసినా.. వపన్ ఇప్పటికిప్పుడు సింగపూర్ వెళ్లడానికి సిద్ధపడటం లేదు. దానికి కారణం ఆయన అధికారిక పర్యటనే. అరకు కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు సోమవారం మాట ఇచ్చానని.. ఆ గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకొంటానని పవన్ కల్యాణ్ చెప్పడం గమనార్హం.
జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేసినందున ఆ పని పూర్తయిన తర్వాతే సింగపూర్ వెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఇక పవన్ అరకు పర్యటన ముగించుకొని విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు జనసేన పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ సమయానికి బయలుదేరుతారు అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కల్యాణ్ – అనా లెజ్నోవాకు మార్క్ శంకర్ పవనోవిచ్ 2017 అక్టోబరులో జన్మించాడు.
ఎనిమిదేళ్ల మార్క్ తన విద్యాభ్యాసాన్ని గత కొన్నేళ్లుగా సింగపూర్‌లోనే చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పాఠశాలలో ఉదయాన్నే జరిగిన అగ్నిప్రమాదంలోనే గాయాలపాలయ్యాడు. అన్నట్లు ఈ రోజు పవన్ పెద్ద తనయుడు అకిరా నందన్ జన్మదినం. ఇలాంటి రోజున మార్క్ శంకర్ పవనోవిచ్ గాయాలపాలవ్వడం బాధాకరం.