‘‘తెలుగు సినిమా పరిశ్రమకు సమస్యలు చాలా ఉన్నాయి… ఒక్క స్టార్ హీరో కూడా పట్టించుకోవడం లేదు’’ – గత కొద్ది రోజులుగా ఏ సోషల్ మీడియాలో చూసినా ఇదే మాట. మన స్టార్లంతా మాట్లాడరేంటి అని అన్నారు. అయితే ఎప్పుడు, ఎక్కడ మాట్లాడితే ఆ విషయం పది మందికీ చేరుతుంది అనేది తెలియాలి. అలాంటి పనే చేశారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఇటీవల జరిగిన ‘లవ్‌స్టోరీ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తెలుగు సినిమా కష్టాలు ఏకరవు పెట్టారు. ‘మీ చేతుల్లోనే ఉంది తెలుగు సినిమా జీవితం’ అంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను వేడుకున్నారు.
చిత్ర పరిశ్రమలో సక్సెస్ రేట్ 10-20శాతం మాత్రమే. ఇది చూసి ఇండస్ట్రీ పచ్చగా కళకళలాడిపోతోంది. ఇక్కడ కూడా కష్టాలు పడేవారు, రెక్కాడితే కానీ, డొక్కాడని కార్మికులున్నారు. వారి సంఖ్య ప్రత్యక్షంగా వేల మంది అయితే… పరోక్షంగా లక్షలు అని చెప్పొచ్చు. ఏ నలుగురైదుగురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు కలిస్తే ఇండస్ట్రీ అవదు. అలాంటి వాళ్లు బాగున్నారు కదా అని, సినిమా ఇండస్ట్రీ మొత్తం బాగుందనుకోకూడదు. నాలుగైదు నెలలు షూటింగ్స్ ఆగిపోయే సరికి సినిమా కార్మికులు అల్లాడిపోయారు. ఆ సమయంలో మేమంతా కలసి హీరోలను, సినీ పెద్దలను, నిర్మాతలను అడిగి డబ్బులు పోగు చేశాం. వాటిని నిత్యావసర సరకులు కోసం కార్మికులకు అందించామని చిరంజీవి చెప్పారు.
ఎక్కడ, ఏ విపత్తు వచ్చినా అందరి కంటే ముందు స్పందించేది చిత్ర పరిశ్రమే. ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజు సంక్షోభంలో పడిపోయింది. సినిమాల నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. అనుకున్న స్థాయిలో ఆదాయం రాకపోవడానికి కారణాలేంటి? ఏం చేస్తే పరిశ్రమ బాగుంటుంది లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశ్రమను ప్రభుత్వాలు ఆదుకోవాలి. ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని కోరుకునే మాకు సాధకబాధకాలు ఉన్నాయి. దయ చేసి వాటిపై దృష్టి పెట్టి, సమస్యలు పరిష్కరించాలని చిరంజీవి కోరారు.
రాష్ట్ర ప్రభుత్వాలను మేం ఆశగా అడగటం లేదు. పరిశ్రమ అవసరానికి అడుగుతున్నాం. చేస్తున్న సినిమాలు పూర్తయిపోయినా మరో సినిమా చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడిపోయాం. ‘ఆచార్య’ చిత్రీకరణ అయిపోయింది. ఎప్పుడు, ఎలా విడుదల చేయాలి అనేది తెలియడం లేదు. సినిమా విడుదల చేస్తే రెవెన్యూ వస్తుందా లాంటి ప్రశ్నలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. సినిమాలు విడుదల చేసినా రెవెన్యూ ఎంత వస్తుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ విషయంలోనే ప్రభుత్వాలు ధైర్యం, వెసులుబాటు ఇవ్వాలి. వీలైనంత త్వరగా చిత్ర పరిశ్రమకు మేలు చేసే జీవోలను విడుదల చేయండి అని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.