మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్.. ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ బయట చాలా స్నేహంగా ఉంటారు కానీ, వెండితెరపై ఎప్పుడూ కలిసి కనిపించలేదు. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఆ లోటును తీర్చబోతోంది. ఇందులో వెంకటేష్ ఒక పాత్ర చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి, అది ఎంతసేపు ఉంటుంది? కేవలం ఒక పాట కోసమేనా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
నిజానికి దర్శకుడు అనిల్ రావిపూడి రాసుకున్న ఒరిజినల్ స్క్రిప్ట్ లో వెంకటేష్ పాత్ర అసలు లేదట. కథ వింటున్నప్పుడు చిరంజీవి ఒక చోట ఆగి, “ఇక్కడ వెంకటేష్ ఉంటే బాగుంటుంది కదా” అని సలహా ఇచ్చారట. మిత్రుడి మీద ఉన్న అభిమానంతో చిరు స్వయంగా ఈ ప్రతిపాదన తేవడంతో, దర్శకుడు వెంటనే ఆ ట్రాక్ ను డెవలప్ చేశారు. వెంకీని సంప్రదించడం, ఆయన వెంటనే ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి.
అయితే ఇది కేవలం వచ్చిపోయే అతిథి పాత్ర కాదని తెలుస్తోంది. వెంకటేష్ పాత్ర నిడివి గురించి దర్శకుడు చెప్పిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో వెంకీ దాదాపు 20 నిమిషాల పాటు కనిపిస్తారు. ఒక స్టార్ హీరో సినిమాలో, మరో అగ్ర కథానాయకుడు ఇరవై నిమిషాల పాటు కనిపించడం అంటే అది మామూలు విషయం కాదు. దీన్ని బట్టి ఇది గెస్ట్ రోల్ కంటే ఎక్కువే అని అర్థమవుతోంది.
ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే ప్లాన్ చేశారట. చిరు, వెంకీ కలిసి చేసే సందడి, వారి మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వెంకటేష్ కు సంబంధించిన పాట షూటింగ్, టాకీ పార్ట్ కూడా ఇప్పటికే పూర్తయ్యిందని సమాచారం. సంక్రాంతి 2026కి వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఒక మల్టీస్టారర్ రేంజ్ ను సంతరించుకుంది.
