మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. మే 9, 2021లో సినిమాను రిలీజ్ చేయాలని చిరు నిర్ణయించుకున్నారట. ఈ డేట్ కి ఓ ప్రత్యేకత ఉంది. చిరంజీవి కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచినా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమా రెండూ కూడా మే 9వ తారీఖున రిలీజ్ చేశారు.
రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా 1990లో విడుదలై బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తరువాతి ఏడాది 1991, మే 9న విడుదలైన ‘గ్యాంగ్ లీడర్’ కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు అదే డేట్ న ‘ఆచార్య’ సినిమాను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సెంటిమెంట్ గనుక వర్కవుట్ అయితే ‘ఆచార్య’ కూడా భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయం. కొద్దిరోజుల్లో రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నారు. దాదాపు ముప్పై రోజుల పాటు చరణ్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సురేశ్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.