వరల్డ్ సినిమాలో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్‌ది ప్రత్యేక శైలి. ఆయన ఎంచుకునే కథలు, చేసే సినిమాలను టచ్ చేయాలని మిగిలిన దర్శకులు కలలో కూడా ఆలోచించరు అని చెబుతుంటారు. అలాంటాయన ఇప్పుడు ‘ఒడిస్సీ’ అనే ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏం చేయబోతోంది అనే అంచనాలు ఓ వైపు సాగుతుండగానే మరోవైపు ఆ సినిమా టీమ్ ఆసక్తికరమైన స్టెప్ వేసింది. అప్పుడే ప్రచారం స్టార్ట్ చేసేశారా అని అనుకుంటున్నారా? ప్రచారం కాదు ఏకంగా టికెట్ల అమ్మకం మొదలుపెట్టేశారు. అవును ఏడాది ముందు స్టార్ట్ చేసేశారు.
హాలీవుడ్ దర్శకుడు అయిన క్రిస్టోఫర్ నోలన్‌కి ఇండియన్ సినిమా ఆడియెన్స్ భారీ సంఖ్యలోనే ఉన్నారు. తన మార్క్ మైండ్ బ్లోయింగ్, మైండ్ బాగ్లింగ్ సినిమాలతో ఊహించని ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంటారాయన. ఆయన అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేసి విడుదల చేయడంలోనూ ఆయన తోపే. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న ‘ఒడిస్సీ’ చిత్రాన్ని కూడా అలానే విడుదల చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో సినిమా ఐమ్యాక్స్ టికెట్ల అమ్మకాన్ని ప్రారంభించారు. ఏదైనా సినిమాకి మహా అయితే రెండు నెలలు ముందు టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. కానీ నోలన్ సినిమాకి మాత్రం ఏకంగా ఏడాదికి ముందే మొదలుపెట్టారు.
‘ఒడిస్సీ’ సినిమాను ప్రత్యేకంగా ఐమ్యాక్స్ 70 ఎంఎం వెర్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐమ్యాక్స్ వారు బుకింగ్స్ ఓపెన్ చేసేశారు. దీంతో నోలన్ సినిమాకి ఉన్న క్రేజ్, ఐమ్యాక్స్ వెర్షన్‌కి ఉన్న క్రేజ్ అర్థమవుతోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 17న వస్తోంది అని ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. విదేశాల్లో ఈ టికెట్లకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది అని సమాచారం. మ్యాట్ డామన్, టామ్ హోలండ్, అనీ హ్యాత్‌వే, జెండాయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. 250 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతోంది.