కమీడియన్ సుధాకర్ గుర్తున్నాడా?? అదే అండీ…ఘరానా బుల్లోడు సినిమాలో “ఇట్లు నీ పుత్ర రత్నం బిళ్ళ బిక్షం” అంటూ కడుపుబ్బా నవ్వించాడు…
హిట్లర్ సినిమాలో మన మెగాస్టార్ ను ‘హిట్లర్’ అంటూ కొంటెగా పిలిస్తూ, ఊరంత టామ్ టామ్ చేస్తూ, చిరు చేతుల్లో దెబ్బలు తిన్నాడు. శుభాకాంక్షలు చిత్రంలో జగపతి బాబుతో కలసి అటు బ్రహ్మీని, ఇటు ఏ.వీ.ఎస్ ను ముప్పు తిప్పలు పెట్టి నీళ్ళు తాగీస్తూనే, ప్రేక్షక లోకాన్ని కడుపుబ్బా నవ్వించాడు. అతనే మన కమీడియన్ సుధాకర్. మెగాస్టార్ చిరుకి చెన్నైలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచీ సుధాకర్ మంచి స్నేహితుడు. అంతేకాకుండా తమిళంలో దాదాపుగా 50 చిత్రాలకు పైగా నటించి అటుపై తెలుగులో దాదాపుగా 600చిత్రాల్లో తన హాస్యంతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టారు. ఇక నిర్మాతగాను సుధాకర్ నాలుగు సినిమాలను తెరకెక్కించారు. అటు హిందిలో సైతం అరంగేట్రం చేసి శుభ్ కామ్న అనే చిత్రంలో నటించడం జరిగింది. అలాంటి హాస్య నటుడు, ప్రేక్షకులను తన హాస్యంతో నవ్వించిన ఆయన జూన్ 29, 2010 న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరి కోమాలోకూ సైతం వెళ్లినట్లు హైదరాబాద్‌లో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు, కానీ కొంతకాలానికి వైద్యసహాయం అందిపబడి కోలుకున్నారు అని సైతం తెలుస్తుంది. కరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆయన డేట్స్ కోసం ఎగబడిన దర్శక నిర్మాతలు, ఆయనతో నటించాలి అని ఉవ్విళ్లూరిన కధానాయకులు ఎవ్వరూ ఇప్పుడు ఆయన్ని పట్టించుకోవడం లేదు కదా, కనీసం పలకరించే నాధుడే లేదు. ఇప్పటికైనా పరిశ్రమ మేల్కోని అంతా అయిపోయాక వెళ్ళి కన్నీళ్ళు కార్చే కన్నా, ఇప్పుడే ఆయన్ని అక్కున చేరుకుంటుంది అని ఆశిద్దాం. ఇక అదే క్రమంలో ఆ హాస్య రస చక్రవర్తి సంధించిన కొన్ని హాస్య రస చిత్రాల విశేషాలు చూద్దాం….
మెగాస్టార్ ‘చిరంజీవి’తో
మన కమీడియన్ సుధాకర్ కు మన మెగాస్టార్ తో ఎంతో మంచి సాన్నిహిత్యం అనుభందం కూడా ఉంది. చిరుతో ఎన్నో సినిమాల్లో నటించిన సుధాకర్, ఆయనతో యముడికి మొగుడు సినిమాను తన స్నేహితుడు నారాయణ మూర్తితో కలసి నిర్మించడం జరిగింది. ఇక చిరుతో సుధాకర్ నటించిన చిత్రాల్లో…ఇద్దరు మిత్రులు (1999), హిట్లర్ (1997), ముగ్గురు మొనగాళ్ళు (1994), మెక్యానిక్ అల్లుడు (1993), రాజా విక్రమార్క (1990), కొదమ సింహం (1990), స్టేట్ రౌడీ (1989), అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989), యాముడికి మొగుడు (1988)
చంటబ్బాయి (1986) చిత్రాలు సుధాకర్ కు మంచి పేరు తెచ్చి పెట్టాయి.
నటసింహం ‘బాలకృష్ణ’ తో
సుధాకర్ నట సింహంతో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. అందులో ముద్దుల మొగుడు (1997), జనని జన్మభూమి (1984), పవిత్ర ప్రేమ (1980) సినిమాలు సుధాకర్ కు మంచి పేరు తెచ్చి పెట్టాయి.
నవమన్మధుడు ‘నాగ్’ తో
దాదాపుగా పెద్ద హీరోలు అందరితో మంచి సాన్నిహిత్యం ఉన్న సుధాకర్, నాగ్ తో సైతం కొన్ని సినిమాలు చేశారు, అందులో కొన్ని కమీడియన్ క్యారెక్టర్స్ కాగా, మరికొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ గా చేశారు. నాగ్ తో సుధాకర్ చేసిన సినిమాల్లో స్నేహమంటే ఇదేరా (2001), సిసింద్రీ (1995), మజ్ను (1987) సినిమాలు సుధాకర్ కు మంచి పేరును తెచ్చి పెట్టాయి.
విక్టరీ ‘వెంకటేష్’ తో
సహజంగానే వెంకీ బాడీ ల్యాంగ్వేజ్ లో కామెడీ ఉంటుంది, అలాంటి వెంకీ కు మన సుధాకర్ తోడైతే భలే ఉంటుంది కదా. అవును సుధాకర్ వెంకీ తో కలసి చేసిన పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అందుల్లో సంక్రాంతి 2005, జెమినీ(2002), రాజా (1999), పెళ్ళిచేసుకుందాం (1997)
పవిత్ర బంధం (1996), సాహసవీరుడు సాగరకన్యా (1996) సినిమాల్లో సుధాకర్ హాస్యం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచి తేల్చింది.
అక్కినేనితో
అక్కినేని నాగేశ్వర్ రావు గారితో సీతారామయ్య గారి మానవరాలు (1991) చిత్రంలో నటించారు.
కృష్ణం రాజుతో
సుధాకర్ ఈ జెనరేషన్ హీరోస్ తోనే కాకుండా అలనాటి కధానాయకులతో కూడా నటించారు రెబెల్ స్టార్ కృష్ణం రాజుతో తాండ్ర పాపారాయుడు (1986) చిత్రంలో సైతం నటించి మెప్పించారు.
ఫ్యామిలీ స్టార్ ‘జగపతిబాబు’ తో
ఫ్యామిలీ అండ్ హ్యాండ్-సమ్ హీరో జగపతి బాబుతో సుధాకర్ నటించిన నటన ప్రేక్షకులను కడుపు చెక్కలయ్యేలా నవ్వించడమే కాకుండా, జగపతి బాబుతో ‘శుభాకాంక్షలు’ చిత్రం ఆయన చేసిన కామెడీకి సాక్షాత్తూ నంది పురస్కారం సైతం దిగివచ్చి అక్కున చేరింద్. ముఖ్యంగా జగపతితో సుధాకర్ చేసిన సినిమాల్లో ఫ్యామిలీ సర్కస్, మూడు ముక్కలాట (2000), చూసొద్దాం రండి (2000), స్వప్నలోకం (1999),శ్రీమతి వెల్లొస్తా (1998), పెళ్లి పీటలు (1998), పెళ్లి కనుక (1998), శుభాకాంక్షలు (1997), దొంగాట (1997), పెళ్లి పందిరి (1997), శుభమస్తు (1995), అల్లరి ప్రేమికుడు (1994), పెద్దరికం (1992) చిత్రాల్లో ఆయన నటించి నవ్వించారు.
నటకిరీటి ‘రాజేంద్రప్రసాద్’ తో
హాస్య నటుడు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తో సైతం సుధాకర్ మంచి పాత్రలు చేశారు. అందులో ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ తో కొబ్బరి బొండాం (1991), ముత్యమంతా ముద్దు (1989) సినిమాల్లో నటించి మెప్పించగా,
కలెక్షన్ కింగ్ ‘మోహన్ బాబు’ తో
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో సైతం సుధాకర్ మంచి సినిమాలు చేశారు. అందులో మోహన్ బాబుతో పోస్ట్‌మ్యాన్(1999), యామ జాతకుడు (1999) సినిమాల్లో హాస్యాన్ని పండించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సైతం సుధాకర్ మంచి సినిమాలు చేశారు అందులో, ఖుషి (2001), గోకులంలో సీత (1997), సుస్వాగతం (1997) సినిమాలు సుధాకర్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
దాదాపుగా అందరి హీరోలతో సుధాకర్ నటించి మెప్పించారు. అందులో ముఖ్యంగా జెడీ చక్రవర్తి తో బొంబాయి ప్రియుడు, వడ్డెనవీన్ తో మయ బాలాజీ, రాజశేఖర్ తో అల్లరి ప్రియుడు, సురేష్ తో పట్టుకోండి చూద్దాం, వేణు తో చెప్పవె చిరుగాలి, ప్రముఖ దర్శకుడు, నిర్మాత, హీరో ఎస్వీ కృష్ణ రెడ్డితో అభిషేకం, ఉగాది, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘నిన్ను చూడాలని’ ఇలా ఎన్నో సినిమాల్లో సుధాకర్ నటించి మెప్పించారు.
ఆయన త్వరగా కోల్కును, మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావాలని, అందరినీ కడుపుబ్బా నవ్వించాలని మనస్పూర్తిగ కోరుకుందాం.