‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చరణ్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇది ‘RC15’ గా ప్రచారమవుతుంది.దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు.అతని బ్యానర్లో ఇది 50వ సినిమా కావడం విశేషం.ఇదిలా ఉండగా.. కనీసం ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలుకాలేదు అప్పుడే ఈ చిత్రం కథ కాపీ అంటూ వివాదాలు మొదలయ్యాయి.’ఈ కథ నాదే’ అంటూ ఓ తమిళ రచయిత ఆరోపిస్తూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళితే.. ‘పిజ్జా’, ‘జగమే తందిరం’, ‘పెట్టా’ వంటి క్రేజీ సినిమాలకు పనిచేసిన సెల్లముత్తు చరణ్- శంకర్ ల మూవీ కథ పై ఫిర్యాదు చేసాడట.’నేను నా గురువు దర్శకుడు అయిన కార్తీక్ సుబ్బరాజు కోసం కథ రెడీ చేసుకున్నాను. దానిని ఓ సందర్భంలో అతనికి వినిపించాను. ఇప్పుడు అదే కథని నన్ను సంప్రదించకుండా,నా అనుమతి లేకుండా,ఏ మాత్రం క్రెడిట్ ఇవ్వకుండా.. దర్శకుడు శంకర్ వాడేసుకోవాలని చూస్తున్నాడు’ అంటూ సెల్లముత్తు చెప్పుకొస్తున్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శంకర్.. ‘కార్తీక్ సుబ్బరాజు చెప్పిన ఓ మూల కథ ఆధారంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను’ అంటూ వెల్లడించాడు. దాంతో సెల్లముత్తు ఈ విధంగా ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. అతని ఆరోపణల్లో నిజం లేకపోతే పర్వాలేదు.. లేదంటే సెల్లముత్తుకి డబ్బులు చెల్లించి స్క్రీన్ పై అతని నేమ్ కూడా వేయాల్సి ఉంటుంది.