గతేడాది విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో క్రాక్ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫ్లాపుల్లో ఉన్న హీరో రవితేజ కెరీర్ ఈ సినిమా నుంచి పుంజుకుంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను వాస్తవ పాత్రలను స్పూర్తిగా తీసుకుని తెరకెక్కించానని గోపీచంద్ మలినేని గతంలో చెప్పుకొచ్చారు. అయితే శివ సుబ్రమణ్యమూర్తి అనే వ్యక్తి క్రాక్ సినిమా కథ తనదేనని చెబుతున్నారు.
2015 సంవత్సరంలో తాను బళ్లెం సినిమా మీడియా డైరెక్టరీ అనే బుక్ రాశానని ఈ బుక్ లో తాను ఏం రాశానో క్రాక్ సినిమాలో అవే సీన్లు ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు. అల్వాల్ లో నివాసం ఉంటున్న ఈ రచయిత క్రాక్ ప్రొడ్యూసర్ తో పాటు ఇతర యూనిట్ సభ్యులపై కూడా చీటింగ్ కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శకుడు గోపీచంద్ మలినేని, క్రాక్ నిర్మాత మధు ఈ ఆరోపణల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
నిర్మాణ సంస్థకు, హీరో, దర్శకుడికి ఫిల్మ్ ఛాంబర్ తరపున ఈ కథ నాదేనని ఇప్పటికే నోటీసులను పంపించానని అయితే ఆ నోటీసులకు వాళ్ల నుంచి రెస్పాన్స్ రావడం లేదని ఆయన చెబుతున్నారు. నిర్మాత జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటారు కాబట్టి తాను ఇక్కడే ఫిర్యాదు చేస్తున్నానని ఆయన వెల్లడించారు. 15 నెలల క్రితం రిలీజైన సినిమాకు సంబంధించి రచయిత ఇప్పుడు కేసు నమోదు చేయడం గమనార్హం.
పోలీసులు ఈ కేసు విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఈ తరహా కాపీ ఆరోపణలు కొత్తేం కాదు. గతంలో పలు పెద్ద సినిమాల విషయంలో కూడా ఈ ఆరోపణలు వినిపించాయి. కాపీ ఆరోపణలు దర్శకనిర్మాతలకు ఇబ్బందిగా మారుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.