తమిళనాట స్టార్ కమెడియన్ అయిన సంతానం నటించగా యావరేజ్ గా నిలిచిన చిత్రం “ధిల్లుకు దుడ్డు”. కామెడీ హారర్ ఫిలిమ్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని “దమ్ముంటే సొమ్మేరా” అనే పేరుతో డబ్బింగ్ చేశారు. మరి ఈ హాస్యభరిత అనువాద చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం..!!
కథ:
కుమార్ (సంతానం) దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ యువకుడు. చేతిలో చిల్లీ గవ్వ లేకున్నా ఆత్మస్థైర్యం మెండుగా ఉన్న కుమార్.. అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితురాలు కాజల్ (అంచల్ సింగ్)ను కలిసి తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. అయితే.. కాజల్ తండ్రి పప్పాజీ (సౌరబ్ శుక్లా)కి కుమార్-కాజల్ పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. అయితే.. వాళ్ళ పెల్లిని డైరెక్ట్ గా కాదంటే వాళ్ళు పారిపోయి పెళ్లి చేసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి.. తాను ఇన్వాల్వ్ అవ్వకుండా స్కెచ్ మణి (రాజేంద్రన్) ద్వారా చంపాలనుకొంటాడు. దెయ్యం గెటప్పుల్లో భయపెట్టి చంపాలనుకొంటాడు స్కెచ్ మణి. అయితే.. వాళ్ళ ప్లానింగ్ ముందే తెలుసుకొన్న కుమార్ ఆ దెయ్యాలతో ఆడుకోవడం మొదలెడతాడు. కట్ చేస్తే.. ఆ బంగ్లాలో నిజంగానే దెయ్యం ఉందని తెలుసుకొంటారు. ఈ దెయ్యాల గోల నడుమ కుమార్-కాజల్ ల వివాహం ఎలా జరిగింది? అనేది “దమ్ముంటే సొమ్మేరా” కథాంశం.
నటీనటుల పనితీరు:
సంతానం కామెడీ టైమింగ్ కొత్తగా చెప్పాల్సింది ఏముంది.. ఎప్పట్లానే సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ తో అలరించాడు. అలాగే డ్యాన్స్ & ఫైట్స్ తోనూ మెప్పించడానికి ప్రయత్నించాడు. కాస్త అతి ఎక్కువైంది అనిపించినప్పటికీ.. డబ్బింగ్ సినిమా కాబట్టి అందునా తమిళ చిత్రం కాబట్టి ఆ మాత్రం అతి తప్పదని అర్ధమవుతుంది. ఇక హీరోయిన్ గా నటించిన అంచల్ సింగ్ ముఖంలో ఒక్కటంటే ఒక్క ఎక్స్ ప్రెషన్ కూడా కనిపించలేదు. ఏదో చూడ్డానికి తెల్లగా ఉంది తప్ప నటన పరంగా అమ్మడికి కనీస స్థాయి అనుభవం కూడా లేదన్న విషయం తెలిసిపోతుంది.
విలన్ టర్నడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆనంద్ రాజ్ ఈ చిత్రంలో తండ్రి పాత్రలో కామెడీ పండించడానికి చేసిన ప్రయత్నం సత్ఫలితాన్నివ్వలేదు.
అయితే.. ఫైటర్ టర్నడ్ యాక్టర్ రాజేంద్రన్ మాత్రం స్కెచ్ మణి పాత్రలో ఓ 20 నిమిషాలపాటు కడుపుబ్బ నవ్వించాడు. సంతానం తర్వాత ప్రేక్షకులు ఎంజాయ్ చేసింది రాజేంద్రన్ పాత్రే. ముఖ్యంగా రియల్ దెయ్యానికి, తాను సెట్ చేసిన దేప్లికేట్ దెయ్యానికి తేడా తెలియక మనోడు చేసే ఓవర్ యాక్షన్ బాగా పేలింది. ఇక నేషనల్ అవార్డ్ ఆర్టిస్ట్ అయిన సౌరబ్ శుక్లాను సరిగా వినియోగించుకోలేదు.
సాంకేతికవర్గం పనితీరు:
ఎస్.ఎస్.తమన్ పాటలు సోసోగా ఉన్నాయి. కార్తీక్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ కంటే సౌండ్ డిజైనింగ్ బాగుంది.
దీపక్ కుమార్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది కానీ.. సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. బ్లూ మాట్ షూట్ విషయంలో ఇంకాస్త లాజికల్ గా ఆలోచించాల్సింది. డబ్బింగ్ విషయంలో డైలాగుల పరంగా తీసుకొన్న జాగ్రత్త, డబ్బింగ్ వాయిస్ ల విషయంలోనూ తీసుకొంటే బాగుండేది. ఇంచుమించుగా కొన్ని వాయిస్ లు ఒకేలా ఉన్నాయి.
దర్శకుడు రామ్ బాల.. రాసుకొన్న కథ వరకూ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఆకట్టుకొనేలా లేదు. ఫస్టాఫ్ మొత్తం క్యారేక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ కే సరిపోయింది. ఈ తరహా చిత్రాన్ని రెండున్నర గంటలు సాగదీయడం కంటే.. రెండు గంటలు లేదా అంతకంటే తక్కువ రన్ టైమ్ తో మంచి కామెడీ సినిమాగా తీయడం చాలా సబబు. సెకండాఫ్ లో కామెడీ సీన్స్ బాగా రాసుకొన్నాడు కానీ.. అప్పటివరకూ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి మాత్రం బోర్ కొట్టించాడు.
విశ్లేషణ:
టైమ్ పాస్ కోసం ఒకసారి సరదాగా చూడదగ్గ చిత్రం “దమ్ముంటే సోమ్మేరా”. సంతానం పంచ్ డైలాగ్స్, రాజేంద్రన్ కామెడీ హైలైట్స్ గా నిలవగా.. స్క్రీన్ ప్లే & అనవసరమైన సన్నివేశాలు, రన్ టైమ్ మైనస్.