సినిమాల వసూళ్లకు నటులకు ఏం సంబంధం లేదా? ఏమో ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్ మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేట్లు, అదనపు షోల సమస్యతో సినిమా నటులకు ఏ మాత్రం సంబంధం లేదు అన్నట్లు మాట్లాడారు నరేశ్. దీంతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సెటైర్లు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. టికెట్ రేట్ల విషయంలో హీరోలంతా స్పందించడం లేదు, వాళ్లకు పారితోషికాల మీద ఉన్న శ్రద్ధ, సినిమాల మీద లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించడం లేదేంటి అంటూ నెటిజన్లు, కొంతమంది పరిశ్రమ శ్రేయోభిలాషులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. దానికి ఆయన నుండి ఎలాంటి సమాధానం లేదు. అయితే విష్ణు దగ్గరుండి ‘మా’ అధ్యక్షుడిగా గెలిపించిన వారిలో ఒకరైన నరేశ్ మాత్రం స్పందించారు. సినిమా టికెట్ ధరల వ్యవహారంలో ‘మా’కు ఎలాంటి ప్రమేయం లేదని తేల్చేశారు. ‘మా’ అనే ఒక స్వతంత్ర వ్యవస్థ అని, నటుల సంక్షేమమే మా పని అని చెప్పేశారు.
దీంతో ఏపీలో సినిమా టికెట్ల విషయంలో మంచు విష్ణు స్టాండ్ అర్థమైపోయింది. ఈ విషయంలో ఆయన వైపు నుండి ఎలాంటి మూవ్ ఉండదని చెప్పేయొచ్చు. ఎందుకంటే ఈ విషయంలో నిర్మాతల మండలి ఓ నిర్ణయం తీసుకోవాలని, దానిని ఏపీ ప్రభుత్వంతో కూర్చుని చర్చించుకోవాలనే సలహా కూడా ఇచ్చారు నరేశ్. సినీ పరిశ్రమ, ప్రభుత్వం కలసి ఓ నిర్ణయానికి వస్తాయని అనుకుంటున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు రాజకీయాలతో సంబంధం ఉండకూడదని నా అభిప్రాయం అని నరేశ్ చెప్పారు.
దీంతో నటులకు, నటుల సంఘానికి సినిమా టికెట్ల ధరలతో సంబంధం లేదని నేరుగానే చెప్పేశారు నరేశ్. ఆయన చెబితే విష్ణు చెప్పినట్లే కదా. దీంతో టాలీవుడ్‌లో చర్చ మరోలా మొదలైంది. సినిమాలకు వసూళ్లు తక్కువొచ్చిన హీరోలు మాట్లాడకూడదా అని అడుగుతున్నారు నెటిజన్లు. నటుల సంఘానికి సినిమా వసూళ్లు తగ్గినా ఇబ్బంది లేదా అని అడుగుతున్నారు. మరి దీనికి ‘మా’ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడుఏమంటారో చూడాలి.