యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ధమ్కీ’ ఈపాటికే రిలీజ్ కావాల్సింది. ఫిబ్రవరి 17న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మూడు నెలల క్రితమే ప్రకటించారు. దానికి తగ్గట్లే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఊహించని విధంగా సినిమాను వాయిదా వేశారు. దీనికి కారణం.. రవితేజ ‘ధమాకా’తో ఈ సినిమాకి పోలికలు ఉన్నట్లు కామెంట్స్ వినిపించాయి. తక్కువ గ్యాప్ లో ఒకలాంటి సినిమాలే రెండు రిలీజైతే రిజల్ట్ తేడా కొడుతుందని భావించిన దర్శకనిర్మాతలు సినిమాను వాయిదా వేసుకున్నారు.
అలానే కొంతవరకు రీషూట్ కూడా చేశారు. రీసెంట్ గా కొన్నిరోజుల పాటు రీషూట్ వర్క్స్ జరిగాయి. అంతా ఓకే అనుకున్న తరువాత గుమ్మడికాయ కొట్టేశారు. తమ సినిమాను వాయిదా వేయడం అన్ని రకాలుగా మంచిదే అయిందని టీమ్ భావిస్తోంది. ఇప్పుడు సినిమాను పెర్ఫెక్ట్ గా రెడీ చేసుకొని క్రేజీ సీజన్ అయిన వేసవిలో రిలీజ్ చేసుకుందామని చూస్తున్నారు. రిలీజ్ డేట్ వాయిదా పడడం వలన ట్రేడ్ లో సినిమాకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.
విశ్వక్ సేన్ సినిమాలకు మొదటి నుంచి నైజాంలో మంచి డిమాండ్ ఉంది. అతడి సినిమాలకు తెలంగాణ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుంటారు. విశ్వక్ సినిమాల్లో తెలంగాణ ఫ్లేవర్ బాగా కనిపిస్తుంటుంది. విశ్వక్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్నది కూడా నైజాంలోనే. ఈ క్రమంలో ‘ధమ్కీ’ సినిమాను ఏషియన్ సునీల్ మంచి రేటు ఇచ్చి నైజాం వరకు హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
దానికోసం ఆయన రూ.4 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. మొత్తంగా ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ రూ.10 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. విశ్వక్ లాంటి యంగ్ హీరో సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ అంటే విశేషమనే చెప్పాలి.