ఆ మధ్య ఎప్పుడో ఓ టీవీ కామెడీ షోలో ‘బయోపిక్’ అంటే మనకు నచ్చినట్లు తీసుకోవాలి, మనం అనుకున్నదే చూపించాలి అంటూ ఓ స్కిట్ వేశారు. ఆ మాటకొస్తే అలాంటి కాన్సెప్ట్‌తో రెండు, మూడు స్కిట్లు కూడా వచ్చాయి. ఆ స్కిట్లు ఓ స్టార్ హీరో చేసిన బయోపిక్‌ను ఉద్దేశించి చేసినవే అని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు మరోసారి అలాంటి స్కిట్లకు, విమర్శలకు, ఆరోపణలకు గ్రౌండ్ సిద్ధమవుతోందా? అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు. కారణం దివంగత ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు బయోపిక్ తీయడానికి రంగం సిద్ధం చేస్తుండటమే.
బయోపిక్‌గా తీయడానికి కావాల్సిన అన్ని అంశాలు దాసరి నారాయణ రావు జీవితంలో ఉన్నాయి. అందులో నో డౌట్. ఆయన బయోపిక్ నేటి తరం దర్శకులు, నటులు, నిర్మాతలు.. ఇలా అందరికీ ఎంతో మార్గదర్శంగా ఉంటుంది కూడా. అయితే గతంలో వచ్చిన ఓ ప్రముఖ నటుడి బయోపిక్‌లాగా సినిమా అంతా ‘భజన’ మాత్రమే జరిగితే… ఉపయోగం లేదు. జీవితకథ అన్నాక.. జీవితంలో మంచి, చెడు రెండూ చూపించాలి.
దాసరి ఉన్నన్నాళ్లూ సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కు… అందులో నో క్వశ్చన్. అందుకే ఇప్పటికీ పరిశ్రమలో ఏదైనా సమస్య వస్తే ‘దాసరి గారు ఉండుంటేనా’ అని అంటుంటారు. అయితే అదే సమయంలో చంద్రుడిలో మచ్చల్లాగా అక్కడక్కడ కొన్ని మచ్చలు ఉన్నాయంటుంటారు సినిమా జనాలు. కొంతమందికే ఫేవర్‌గా దాసరి ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే ఆయన కేవలం సినిమా మనిషే కాదు. పత్రికా రంగంలో తనదైన ముద్రవేశారు. రాజకీయాల్లోనూ రాణించారు.
కాబట్టి దాసరి జీవితచరిత్ర అంటే… షడ్రుచుల భోజనంలాగా ఉండాలి. మనిషిలో మంచి చెప్పడంతోపాటు, కష్టాలు కూడా చెబితే ఆ సినిమా విజయం సాధిస్తుంది. దీనికి ‘మహానటి’నే ఉదాహరణ. సావిత్రి గురించి మొత్తం మంచే చెప్పుంటే ఆ సినిమా ఎలా ఉండేదో ఆలోచించక్కర్లేదు. కాబట్టి దాసరి జీవితం చూపించండి… కానీ జరిగింది జరిగినట్లు అందరి తెలిసేట్లు చూపిస్తే చాలు.