మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గత చిత్రం బ్రూస్లీ పరాజయం పాలయింది. డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ 2 ఫెయిల్ అయింది. హిట్ కోసం ఎదురు చూస్తున్న వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ ధృవ. ఇందుకోసం రామ్ చరణ్, సురేందర్ రెడ్డి ఏడాది పాటు కష్టపడ్డారు. ఆ కష్టం ఈ మూవీ టీజర్, ట్రైలర్లో స్పష్టమవుతోంది. అంచనాలను భారీగా పెంచింది. రేపు ఉదయం ఆటతో ప్రదర్శితం కానున్న ధృవ సినిమా ప్రీ రివ్యూ…
కథ : పదేళ్ల తర్వాత ఎలా ఉండాలో ఇప్పుడే డిసైడ్ చేసే విలన్. వార్త దిన పత్రికల్లో ఒకటో పేజీకి పదో పేజీకి లింక్ ఏమిటి ? దాని వెనుక ఉన్న వ్యక్తి ఎవరో కనిపెట్టే ఐపీఎస్ ఆఫీసర్ . తాను ఎదగడానికి సొంత తండ్రిని చంపడానికి వెనుకాడని మనస్తత్వం ఒకరి దైతే.. ఒక్కరికి కూడా హాని కలగకూడదని తపించే వ్యక్తిత్వం మరొకరిది. వీరిద్దరికి మధ్య కోల్డ్ వారే ధృవ మూవీ కథ. తమిళంలో హిట్ అయిన తని వరువన్ మూవీకి ఇది రీమేక్ అయినప్పటికీ ఇందులో సురేందర్ రెడ్డి 8 అనే కొత్త పాయింట్ ని చేర్చారు. దీంతో స్ట్రైట్ మూవీ ఫ్లేవర్ ని ఈ మూవీ అద్దుకుంది. తనపైన ఇన్వెస్ట్ గేట్ చేసి పట్టుకోమని హీరోని విలన్ ఛాలెంజ్ చేయడం కథలో ఇంట్రస్ట్ కలిగిస్తుంది. విలన్ ప్రయోగించిన “చిప్” ప్లాన్ తోనే హీరో అతన్ని ఎలా అంతమొందించాడో అనేదే కథ.
నటీనటులు : హీరో రామ్ చరణ్ తేజ్ ఇదివరకు చిత్రాలకంటే ఇందులో కొత్తగా కనిపించారు. లుక్ లోనే కాదు నటనలోను వైవిద్యం ప్రదర్శించారు. ట్రైలర్ లోనేకాకుండా నిన్న రిలీజ్ చేసిన వన్ మినిట్ వీడియోలోను అద్భుత నటన కనబరిచారు. చిత్రంపై క్యూరియాసిటీని పెంచారు. తమిళ వెర్షన్ లో విలనిజంతో ఆకట్టుకున్న అరవింద్ స్వామి తెలుగులోనూ అంతకుమించి యాక్టింగ్ చేశారు. చెర్రీ, అరవింద్ స్వామి పోటాపోటీగా నటించి ఆడియన్స్ ని కుర్చీలో కదలకుండా చేస్తారనడంలో సందేహం అవసరంలేదు. ఇక రకుల్ ప్రీత్ అందాలతో ఆడియన్స్ కి ఆహ్లాదాన్ని పంచనుంది. ఆమె పాత్రకు తగిన న్యాయం చేసింది.
సాంకేతిక నిపుణులు : ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్ లా పీ ఎస్ వినోద్ తన లెన్స్ తో బంధించారు. ముఖ్యంగా కాశ్మీర్ అందాలను కొత్తగా చూపించారు. మైండ్ గేమ్ తో సాగే ఈ కథ కి ఎడిటింగ్ చాలా కీలకం. ఆ పనిని నవీన్ వంద శాతం ఫర్ఫెక్ట్ గా చేశారు. తన కత్తెరతో స్టోరీకి స్పీడ్ పెంచారు. చిత్రం రిలీజ్ కి ముందే పాటలతో హిప్ హప్ తమీజా అభినందనలు అందుకున్నారు. సినిమా చూసిన తర్వాత అతను ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కి అద్భుతహ అనాల్సిందే. నిర్మాతలు అల్లు అరవింద్, ఎన్. వి. ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు అవుట్ పుట్ స్పష్టం చేస్తోంది.
విశ్లేషణ : తమిళ చిత్రాన్ని మక్కికి మక్కి దించకుండా రామ్ చరణ్ ఇమేజ్ కి తగినట్లు ఇందులో మార్పులు చేశారు. తని వరువన్ మూవీ చూసిన వారికీ కూడా ఈ మూవీ థ్రిల్ ఇస్తుంది. హీరో, విలన్ల మధ్య ఉండే సీన్లు వావ్ అనిపిస్తాయి. థ్రిల్లర్ మూవీ జానర్ ఇష్టపడే వారికి ఇది చాలా బాగా నచ్చుతుంది. చెర్రీ స్టెప్పులు, ఫైట్లు మెగా అభిమానులతో చప్పట్లు కొట్టిస్తాయి. క్లాస్ ఆడియన్స్ నే కాకుండా మాస్ ఆడియన్స్ ని ధృవ మెప్పిస్తుంది.