ఈ మధ్య సినిమా వాళ్ళు యూట్యూబర్ల పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు స్పష్టమవుతుంది. కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు దానిని చీల్చి చెండాడమే పనిగా పెట్టుకున్నారు కొందరు యూట్యూబర్లు. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరిట వాళ్ళు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దారుణమైన విషయం ఏంటంటే.. వాళ్ళని చూసి మరికొంత మంది ముక్కు మొహం తెలియని బ్యాచ్ అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు చెందిన కొందరు రిపోర్టర్లు కూడా అలాగే వీడియోలు చేసి కొత్త సినిమాలను చంపేసే ప్రోగ్రామ్లు పెట్టుకున్నారు.
వీటి వల్ల సినిమాలు మార్నింగ్ షోలకే చచ్చిపోతున్నాయి. పోనీ వీళ్ళు పాజిటివ్ గా చెబితే జనాలు వెళ్లి థియేటర్లలో సినిమా చూస్తారా అంటే అదీ లేదు. కానీ అటు ఇటుగా ఉన్న సినిమాలు.. ఒక్కోసారి బ్రతికే ఛాన్స్ ఉంటుంది. వీకెండ్ వరకు అయినా అవి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయి. కానీ ఈ యూట్యూబర్ల వల్ల ఆ పరిస్థితులు కూడా కనిపించడం లేదు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా యూట్యూబర్ల పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మొన్నటికి మొన్న ‘వర్జిన్ బాయ్స్’ సినిమా మేకర్స్ ఓ యూట్యూబర్ పై కేసు పెట్టారు. అంతకు ముందు ‘కన్నప్ప’ విషయంలో ఓ సెక్షన్ ఆఫ్ యూట్యూబర్స్ ని ఫోకస్ చేసి మంచు విష్ణు… కేసులు వేస్తామని ఓ నోటీసు ఇచ్చి స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశాడు. ఇక తాజాగా కిరణ్ అబ్బవరం ఇంకో అడుగు ముందుకేసి ‘ ఓ యూట్యూబర్ పై తన సినిమాలో సెటైర్ వేశాడు’.
‘గూను కింద పెట్టి.. మలయాళం ప్రేమ కథలు, తెలుగు ప్రేమ కథల గురించి ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ’ ఓ యూట్యూబర్ ను మాస్ ట్రోలింగ్ చేశాడు. పనిలో పనిగా తెలుగు ప్రేక్షకులపై కూడా సెటైర్ వేశాడు. కానీ ఆ యూట్యూబర్ ని కార్నర్ చేయడంతో ఇది మరింత హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇప్పుడిప్పుడే హీరోగా మార్కెట్ పెంచుకుంటున్న కిరణ్ అబ్బవరంకి యూట్యూబర్ల పై ఫోకస్ అవసరమా అనేది కొందరి అభిప్రాయం.