 
                                    మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చిన తాజా హారర్ ఫిలిం “డీయస్ ఈరే”. “భూతకాలం, భ్రమయుగం” సినిమాల దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ హీరోగా నటించాడు. ఈ హారర్ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

కథ: కొచ్చిలో ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన యువకుడు రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్). సరదాగా స్నేహితులతో పార్టీ చేసుకుంటూ ఉండగా.. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కని (సుస్మిత భట్) సూసైడ్ చేసుకుని చనిపోయిందని తెలుసుకుంటాడు.
మరుసటిరోజు ఆమె ఇంటికి వెళ్తాడు రోహన్. ఆరోజు నుండి రోజు రాత్రి అతనికి వింత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరో తనని వెంటాడుతున్నట్లు, ఎవరో తన చుట్టూ ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాడు.
మొదట్లో చనిపోయిన తన ఎక్స్ కని అనుకుంటాడు కానీ.. అది కని కాదని తెలిసి షాక్ అవుతాడు.
ఇంతకీ రోహన్ ను ఫాలో అవుతున్న దెయ్యం ఎవరు? దాన్నుండి రోహన్ ఎలా బయటపడ్డాడు? అందుకు సహాయపడింది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.

నటీనటుల పనితీరు: ప్రణవ్ మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజన్స్, అతడి హావభావాలు సినిమాకి మెయిన్ ఎస్సెట్. ముఖ్యంగా భయాన్ని ఫీలయ్యే సన్నివేశాల్లో భలే నటించాడు. అతడి భయాన్ని, కంగారుని ప్రేక్షకులు కూడా ఫీలయ్యేలా చేశాడు ప్రణవ్.
పాపం పేరుకే హీరోయిన్ కానీ.. సుస్మిత భట్ ఫొటోల్లో తప్ప మనిషిగా కనిపించేది ఉండదు. అయినా ఆమె పాత్ర చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆమె ప్రెజన్స్ ను ఫీలవుతాం.
జిబిన్ గోపీనాథ్ పాత్ర హారర్ తోపాటు కామెడీని కూడా పండించింది. స్క్రీన్ ప్లే ముందుకు సాగడంలో అతడి పాత్ర కీలకంగా మారిన విధానం అలరిస్తుంది.
ఇక జయ కురూప్ ఈ సినిమాకి సర్ప్రైజ్ ప్యాకేజ్. ఆమె క్యారెక్టర్ ప్రెడిక్టబుల్ గానే ఉన్నప్పటికీ.. సదరు క్యారెక్టర్ ను ఆడియన్స్ భీభత్సంగా ఎంజాయ్ చేస్తారు.

సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ సినిమా ఇది. సౌండ్ డిజైన్ కానీ, మిక్సింగ్ కానీ, ఎస్.ఎఫ్.ఎక్స్ కానీ ఆడియన్స్ కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు.
సినిమాటోగ్రాఫర్ షహనాద్, మ్యూజిక్ డైరెక్టర్ క్రిష్టో జేవియర్ లను ఈ విషయంలో కచ్చితంగా మెచ్చుకోవాలి. తమ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.
సౌండ్ డిజైన్ అయితే పీక్ లెవల్లో ఉంది. ముఖ్యంగా లేడీస్ హెయిర్ క్లిప్ తో క్రియేట్ చేసిన సౌండింగ్ బాగుంది. అలాగే.. డోర్ తెరుచుకున్న, గాలికి కర్టెన్ ఊగే సన్నివేశాలు భలే వర్కవుట్ అయ్యాయి.
అలాగే.. మేకప్ టీమ్ కూడా తమ బెస్ట్ ఇచ్చారు. కని డెడ్ బాడీ, కని తమ్ముడు కాళ్ళు విరిగిపోయే సీక్వెన్సుల్లో ప్రాస్థెటిక్ వర్క్ వీర లెవల్లో ఉంది. అంత నేచురల్ గా ఈమధ్యకాలంలో ఇండియన్ మూవీస్ లో మనం చూడలేదు అనే చెప్పాలి.
దర్శకుడు రాహుల్ సదాశివన్.. ఒక సింపుల్ స్టోరీని, క్రేజీ టెక్నికాలిటీస్ తో చెప్పాడు. ముఖ్యంగా సీన్ కంపోజిషన్ అనేది సినిమాకి కీ ఎస్సెట్. అవి హారర్ సీన్స్ కావచ్చు, భయాన్ని క్రియేట్ చేసే విధానం బాగుంటుంది. ట్విస్ట్ కూడా ఊహించేదే అయినప్పటికీ.. అందులో ఎమోషన్ ఎలివేట్ చేసిన విధానం దర్శకుడిగా అతడి పనితనానికి ప్రతీకగా నిలుస్తుంది. ముఖ్యంగా రాహుల్ మునుపటి సినిమాలు “భూతకాలం, భ్రమయుగం” ఎక్స్ పీరియన్స్ చేసిన ఆడియన్స్ కు “డీయస్ ఈరే” కూడా అదే స్థాయిలో నచ్చుతుంది.

విశ్లేషణ: సిన్సియర్ హారర్ సినిమాలు మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి చాలా అరుదుగా వస్తుంటాయి. అనవసరమైన పాత్రలు, సన్నివేశాలు లేకుండా స్ట్రయిట్ టు ది పాయింట్ హారర్ ఫిలిం అనేది వచ్చి చాలా రోజులైంది. ఆ వెలితిని తీర్చిన సినిమా “డీయస్ ఈరే” అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. క్లైమాక్స్ ట్విస్ట్ తోపాటు సెకండ్ పార్ట్ కోసం లీడ్ ఇచ్చిన సీక్వెన్స్ కూడా బాగుంది. ముఖ్యంగా క్రీస్టో జేవియర్ బ్యాగ్రౌండ్ స్కోర్ & రాహుల్ సదాశివన్ డీలింగ్ కోసం “డీయస్ ఈరే”ను కచ్చితంగా మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లలో చూడాల్సిందే.

ఫోకస్ పాయింట్: హారర్ ను మించిన హారిఫిక్ ఎక్స్ పీరియన్స్!
రేటింగ్: 3.5/5
