Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!
- January 27, 2026 / 06:52 PM ISTByFilmy Focus Writer
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కెరీర్ లో ఎత్తుపల్లాలు సహజమే అయినా, ఆయన ప్లానింగ్ మాత్రం ఎప్పుడూ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. గతేడాది ‘గేమ్ ఛేంజర్’ వంటి భారీ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన వేసిన లెక్కలు ఈ ఏడాది సంక్రాంతికి పక్కాగా వర్కవుట్ అయ్యాయి. ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘అనగనగా ఒక రాజు’ వంటి చిత్రాలను నైజాం, వైజాగ్ ఏరియాల్లో విడుదల చేసి భారీ లాభాలు గడించిన దిల్ రాజు, ఇప్పుడు 2026లో ఏకంగా ఆరు సినిమాలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
Dil Raju
ఈ ఏడాది దిల్ రాజు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా బాలీవుడ్‌లోనూ తన జెండా పాతాలని ఫిక్స్ అయ్యారు. తెలుగులో విజయవంతమైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్‌తో రీమేక్ చేయబోతున్నారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో వెంకటేష్ పాత్రను అక్షయ్ చేస్తుండగా, ఐశ్వర్య రాజేష్ పాత్ర కోసం విద్యాబాలన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనితో పాటు సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో మెగా ప్రాజెక్ట్‌ను కూడా దిల్ రాజు హిందీలో నిర్మిస్తున్నారు.
తెలుగు విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రౌడీ జనార్ధన్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. అలాగే ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ‘ఎల్లమ్మ’ చిత్రం కూడా దిల్ రాజు బ్యానర్‌లోనే వస్తోంది. సుమారు రూ. 50 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ పీరియడ్ డ్రామాపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది.
ఇవే కాకుండా ఆశిష్ రెడ్డి హీరోగా ‘దేత్తడి’, ‘సెల్ఫిష్’ వంటి చిత్రాలు కూడా ఈ ఏడాది దిల్ రాజు బ్యానర్ నుంచి రానున్నాయి. డిస్ట్రిబ్యూటర్‌గా సంక్రాంతికి పొందిన ఉత్సాహంతో, ఇప్పుడు నిర్మాతగా బాలీవుడ్, టాలీవుడ్ మార్కెట్‌లను ఏకకాలంలో శాసించాలని ఆయన చూస్తున్నారు. గతేడాది తగిలిన ఎదురుదెబ్బల నుంచి నేర్చుకున్న పాఠాలతో, 2026లో దిల్ రాజు చేస్తున్న ఈ ‘బిగ్ గేమ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.











