‘‘సినిమా ఇండస్ట్రీని మీ రాజకీయాల కోసం వాడుకోవద్దు’’ అంటూ ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) నిన్న ఓ ప్రెస్‌నోట్ కార్పొరేషన్ ఎక్స్ అకౌంట్ షేర్ చేశారు. సినిమా పరిశ్రమతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చల గురించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా దిల్ రాజు ఈ ట్వీట్ చేశారు అని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల సమావేశంపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరం.
సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుగా జరిగిన వ్యవహారం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగులపై స్నేహపూర్వకంగా సమావేశం అది. ఎలాంటి దాపరికరాలు లేకుండా జరిగిన సమావేశం విషయంలో చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉంది. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగొద్దు. పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దు. రాజకీయ దాడి, ప్రతిదాడులకు పరిశ్రమను వాడుకోవద్దు అని లేఖలో దిల్ రాజు రాశారు. అయితే, ఇక్కడ దిల్ రాజు గుర్తించాల్సిన విషయం ఏంటంటే..
అల్లు అర్జున్ (Allu Arjun) – సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఈ విషయంలోకి రాజకీయ పార్టీలు ప్రవేశించాయి. అల్లు అర్జున్ మీద రేవంత్ కోపంగా ఉన్నారని.. దానికి ఓ కారణం ఉంది అంటూ ఏవేవో కామెంట్లు చేశాయి. ఆ సమయంలో ఆ ట్వీట్లకు, కామెంట్లకు సినిమా ప్రేక్షకులు / నెటిజన్ల నుండి స్పందన వచ్చింది. నిజానికి ఆ సమయంలోనే ఈ విషయంలో రాజకీయ ప్రమేయం వద్దు అని పిలుపు ఇచ్చి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. నిజానికి కొన్ని రోజుల క్రితం మంచు విష్ణు (Manchu Vishnu) కూడా నటులకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ‘ఈ విషయంలో ఎవరూ మాట్లాడొద్దు’ అని చెప్పారు.
అలా ముందుగానే ఈ పొలిటికల్ టచ్‌ను కంట్రోల్ చేయడానికి పిలుపు ఇవ్వాల్సింది అనే వాదన వినిపిస్తోంది. మరోవైపు కొన్ని నెలల క్రితం ప్రముఖ నటుడి కుటుంబ విషయంలో సినిమా నటులు కొందరు హార్స్‌గా స్పందించారని.. దానికి కూడా పొలిటికల్ టచ్ ఆ రోజుల్లో కొన్ని పార్టీలు ఇచ్చాయని.. అవి కూడా ఇబ్బందికరంగా మారాయి అనే వాదన కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే.. ఇప్పటికైనా దిల్ రాజు ‘మాకు రాజకీయాలు’ వద్దు అని తేల్చేయడం మంచిది.