టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ‘వరిసు’ అనే తమిళ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ‘వారసుడు’ అనే టైటిల్ తో తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి తెలుగు సినిమాలు పోటీలో ఉండగా.. తమిళ సినిమాలకు ఎలా థియేటర్లు ఇస్తామంటూ ఇదివరకు దిల్ రాజు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడే తన నిర్మాణంలో తెరకెక్కిన డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్లు బుక్ చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.
దీనివలన సంక్రాంతికి రానున్న చిరంజీవి సినిమా ‘వాల్తేర్ వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాలకు థియేటర్ల సమస్య వచ్చేలా ఉంది. ఈ రెండు సినిమాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎవరూ కూడా ఈ విషయంపై ఓపెన్ గా మాట్లాడలేదు. కానీ అభిమానులతో పాటు నిర్మాతల మండలి దిల్ రాజుకి వ్యతిరేకంగా మాట్లాడింది . అయితే గత కొన్ని రోజుల్లో పరిణామాలు కొంతమేర దిల్ రాజుకి అనుకూలంగా మారాయి. ‘వారసుడు’ సినిమాకి థియేటర్లు ఇవ్వకపోతే తెలుగు సినిమాలకు తమిళనాట ఇబ్బందులు తప్పవన్నట్లుగా లింగుస్వామి సహా అక్కడి ఇండస్ట్రీ జనాలు హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్.. దిల్ రాజుకి మద్దతుగా మాట్లాడారు. మైత్రి వాళ్లు ఒకేసారి రెండు సినిమాలను రిలీజ్ చేసుకోవచ్చు కానీ.. ఒక తెలుగు దర్శకుడు, నిర్మాత తీసిన సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసుకోకూడదా..? అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్నాయి. కోలీవుడ్ లో కూడా మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఇలాంటి సమయంలో కోలీవుడ్ తో రగడకి ఎవరూ ఇష్టపడడం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో నిర్మాతల మండలి తరఫున ప్రసన్న కుమార్ కూడా స్పందించారు. డబ్బింగ్ సినిమాలను ఆపాలనేది తమ ఉద్దేశం కాదని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఇప్పుడు దిల్ రాజు సేఫ్ అయినట్లే అనిపిస్తుంది. అదే జరిగితే మైత్రి సంస్థకు ఇబ్బందులు తప్పవు.