మలయాళ సినిమా ‘లోక’ తెలుగులో ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ పేరుతో ఇటీవల రిలీజ్ అయ్యింది. కళ్యాణి ప్రియదర్శన్, నెస్లెన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల అంటే ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు వెర్షన్.. సాంకేతిక లోపాల కారణంగా కొంచెం ఆలస్యంగా అంటే ఈవెనింగ్ షోలతో రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.
బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ పై సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేశారు. ఇటీవల ఆయన ‘కింగ్డమ్’ ‘వార్ 2’ వంటి సినిమాలతో నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘కొత్త లోక’ ఆయనకు కొంత రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాకి దుల్కర్ సల్మాన్ నిర్మాత. అతనితో నాగవంశీ ‘లక్కీ భాస్కర్’ చేశాడు.ఆ పరిచయం కారణంగానే ‘కొత్త లోక’ రిలీజ్ చేశాడు అని చెప్పాలి.
ఇక ‘కొత్త లోక’ చిత్రాన్ని చాప్టర్ 1 గా రిలీజ్ చేశారు. అంటే చాప్టర్ 2 కూడా ఉన్నట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఒక్క చాప్టర్ 2 మాత్రమే కాదు.. చాప్టర్ 5 వరకు మరో 4 సినిమాలు ఉంటాయని తెలుస్తోంది. స్వయంగా దర్శకుడు డామినిక్ అరుణ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కొత్త లోక’ యూనివర్స్ లో భాగంగా మరో 4 కథలు ఉంటాయని ఆయన వెల్లడించారు. వాస్తవానికి ‘కొత్త లోక’ లో టోవినో థామస్, దుల్కర్ సల్మాన్..లు గెస్ట్ రోల్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ చాఫ్టర్లలో వాళ్ళు కూడా హీరోలుగా నటించే అవకాశం ఉంది.