తక్కువ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించి భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించగల టాలెంట్ ఉన్న దర్శకునిగా మారుతికి పేరుంది. యూత్ మెచ్చే కథలతో పాటు ఫ్యామిలీ కథలను తెరకెక్కించి మారుతి దర్శకునిగా పాపులారిటీ తెచ్చుకున్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న మారుతి తాను పదో తరగతి తర్వాత వాహనాల నంబర్ ప్లేట్లకు స్టిక్కరింగ్ వేసేవాడినని ఆ సమయంలో తొలి సంపాదన 35 రూపాయలు అని చెప్పుకొచ్చారు. నిజ జీవితంలో చూసిన ఘటనలనే ఈరోజుల్లో, బస్ స్టాప్ సినిమాలలో చూపించానని మారుతి తెలిపారు.
ప్రేమకథాచిత్రమ్ బాగా ఆడదని నాకు కావాల్సిన వాళ్లు చెప్పడంతో తన పేరు వేసుకోలేదని మారుతి అన్నారు. బన్నీతో అల్లాద్దీన్ లాంటి సినిమాను చేయాలని భావిస్తున్నానని బన్నీకి యానిమేషన్ అంటే చాలా ఇష్టమని మారుతి పేర్కొన్నారు. బస్ స్టాప్ సినిమా సమయంలో తనపై కొందరు బూతు డైరెక్టర్ అనే ముద్ర వేశారని మారుతి చెప్పారు. కెరీర్ ప్రారంభంలో ఒక పెద్ద నిర్మాత ముఖంపై తలుపులు వేయడంతో కోపం వచ్చిందని
తాను కొత్త జంట మూవీ తీస్తున్న సమయంలో ఆ నిర్మాత తనకో సినిమా చేసిపెట్టాలని అడగడంతో కోపం పోయిందని మారుతి అన్నారు. స్టిక్కరింగ్ తర్వాత హైదరాబాద్ కు వచ్చానని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ట్ అంటే ఏంటో తెలిసిందని మారుతి తెలిపారు. ఇప్పటివరకు తన డైరెక్షన్ లో గ్రాఫిక్స్ పధాన చిత్రాలు రాలేదని తన విజువల్ ఎఫెక్ట్స్ మరో స్థాయిలో ఉంటుందని మారుతి వెల్లడించారు.