తీసినవి నాలుగు సినిమాలు.. ఇంకో సినిమా వచ్చే ఏడాది వస్తుంది అని ప్రకటించారు. చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఒకటి అనౌన్స్ చేసి చాలా రోజులైంది, అదిప్పుడు చేతులు మారుతోంది అంటున్నారు. ఇంకొకటి అనౌన్స్‌మెంట్ ముందే ఆగిపోయింది. దీంతో ఆ దర్శకుడి విషయంలో ఏం జరుగుతోంది. ఎందుకు ఇలా ఆయన సినిమాలు ఎందుకు ఆగుతున్నాయ్, చేతులు మారుతున్నాయ్ అనేది అర్థం కాని పరిస్థితి. ‘ఆ!’ (Awe) సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma).
ఆ తర్వాత ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy) అంటూ రెండు సినిమాలు చేసి ‘ఈ దర్శకుడు సగటు డైరెక్టర్’ కాదు అని చెప్పకనే చెప్పారు. ఆ తర్వాత ‘హను – మాన్’ (Hanu Man) అంటూ ఓ సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చారు. ఏదో మామూలు సినిమా అనుకుంటున్నారేమో.. అస్సలు కాదు, సినిమా చూశాక మీకే తెలుస్తుంది అని టీజర్, ట్రైలర్‌తో చూపించిన ఆయన.. సినిమా వచ్చేసరికి ‘ఈయన మామూలోడు కాదు’ అని చెప్పారు. ‘హను – మాన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది.
వరుస ఛాన్స్‌లు రావడం మొదలుపెట్టాయి. కానీ ఇప్పుడు ఏదో ఇబ్బంది మొదలైంది. వరుసగా రెండు సినిమాల ఆయన నుండి దూరం అవుతున్నాయి. ఒక విషయంలో ఇప్పటికే ఓ సినిమా టీమ్ అనౌన్స్ చేసేసింది. రెండో టీమ్ ఇప్పుడు అదే పనిలో ఉంది అంటున్నారు. ఓ యువ దర్శకుడిని దీని కోసం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈసారి సామరస్యపూర్వకంగా మార్పు జరుగుతుంది అని అంటున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా సమయంలోనే ‘అధీరా’ అనే ఓ సినిమా స్టార్ట్ అయింది గుర్తుందా? ‘ఆర్‌ఆర్‌ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య (D. V. V. Danayya) తనయుడు కల్యాణ్ దాసరి హీరోగా ఆ సినిమా ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఈవెంట్ కూడా పెట్టారు. ఆ సినిమా గురించి ఇటీవల ఎలాంటి ముచ్చటా లేదు. అయితే ’అధీరా’ బాధ్యతను ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) దర్శకుడు విజయ్ బిన్నీకి (Vijay Binni) ఇచ్చారు అని టాక్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట. ఇదంతా ఓకే కానీ.. ఎందుకు సినిమాలు ఇలా చేతులు మారుతున్నాయి.