Bhaje Vaayu Vegam Review in Telugu: భజే వాయు వేగం సినిమా రివ్యూ & రేటింగ్!
May 31, 2024 / 08:07 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
కార్తికేయ (Hero)
ఐశ్వర్య మీనన్ (Heroine)
రవిశంకర్, తనికెళ్లభరణి తదితరులు.. (Cast)
ప్రశాంత్ రెడ్డి (Director)
యువి కాన్సెప్త్స్ (Producer)
కపిల్ కుమార్ (Music)
ఆర్.డి.రాజశేఖర్ (Cinematography)
Release Date : మే 31, 2024
యువ కథానాయకుడు కార్తికేయ (Karthikeya) ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం “భజే వాయు వేగం” (Bhaje Vaayu Vegam). ప్రశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యువి సంస్థ నిర్మించింది. ట్రైలర్ & టీజర్ సినిమాపై మంచి అంచనాలు నమోదు చేశాయి. మరి సినిమా ఏ స్థాయిలో ఉందో చూద్దాం..!!
కథ: క్రికెటర్ అవుదామనే ఆశయంతో సిటీకి వస్తాడు వెంకట్ (కార్తికేయ). తన ఆశయం నెరవేరకపోగా.. దారుణంగా మోసపోయి, ఏం చేయాలో తెలియని స్థితిలో ఐపీయల్ బెట్టింగ్ లో డబ్బులు కూడా పోగొట్టుకొని, అటు తండ్రికి ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేక దిక్కు తోచని స్థితిలో కూరుకుపోతాడు వెంకట్. అయితే.. తాను ఈ స్థితికి చేరుకోవడానికి కారణం డేవిడ్ (రవిశంకర్) (Ravi Shankar) అని తెలుసుకొని, అతడి కాస్ట్లీ కార్ కొట్టేస్తాడు.
కట్ చేస్తే.. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వెంకట్ వెంట పడుతుంది. అసలు డేవిడ్ కార్ లో ఏముంది? ఎందుకని పోలీసులు వెంకట్ ను తరుముతున్నారు? వెంకట్ తన తండ్రిని బ్రతికించుకోగలిగాడా లేదా? వంటి ప్రశ్నలకు ఆసక్తికరంగా చెప్పిన సమాధానాల సమాహారమే “భజే వాయు వేగం” చిత్రం.
నటీనటుల పనితీరు: కార్తికేయ ఈ తరహా పాత్రలో చక్కగా ఒదిగిపోతాడు. బాడీ లాంగ్వేజ్ మొదలుకొని, క్యారెక్టర్ మాడ్యులేషన్ వరకూ ప్రతీ విషయంలో కొత్తదనం చూపడానికి తపిస్తాడు. ఈ చిత్రంలోనూ వెంకట్ అనే సగటు యువకుడిగా అలరించాడు. యాక్షన్ బ్లాక్స్ & రేసింగ్ సీక్వెన్స్ లు ఏదో గాల్లో ఎగిరిపోకుండా.. రియాలిటీకి కాస్త దగ్గరగా ఉండేలా చూసుకుంటూ ఓ సగటు యువకుడిగా కనిపించిన విధానం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.
ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) గ్లామర్ యాడ్ చేసింది కానీ.. నటిగా తేలిపోయింది. ఎమోషనల్ సీన్స్ లో ఆమె ఎక్స్ ప్రెషన్ ఏమిటి అనేది అర్ధం కాదు. రాహుల్ టైసన్ (Rahul Tyson) మంచి ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో అలరించాడు. రవిశంకర్ ఎప్పట్లానే తన పాత్ర మరియు గాత్రంతో విశేషంగా ఆకట్టుకున్నాడు.
సాంకేతికవర్గం పనితీరు: ఆర్.డి.రాజశేఖర్ (R. D. Rajasekhar) సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. ఛేజింగ్ సీక్వెన్స్ & ఫైట్స్ ను చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ముఖ్యంగా కార్ ఛేజింగ్ సీక్వెన్స్ మంచి కిక్ ఇస్తాయి. కపిల్ కుమార్ పాటల కంటే నేపధ్య సంగీతం బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ & టెక్నికాలిటీస్ అన్నిట్లోనూ యువీ మార్క్ స్పష్టంగా కనిపించింది.
దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఎంచుకున్న కథలో ఆసక్తికరమైన పాయింట్ అనేది లేకపోయినా.. కథనాన్ని నడిపిన విధానం మాత్రం బాగుంది. ముఖ్యంగా ట్విస్టులను అల్లిన విధానం భలే ఉంది. కాకపోతే.. కథలోకి వెళ్లడానికి, క్యారెక్టర్స్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి మరీ ఎక్కువ సమయం తీసుకొన్నాడు. ఈ తరహా టైమ్ పాస్ థ్రిల్లర్స్ కు మరీ ఎక్కువ వివరణ ఇస్తే స్క్రీన్ ప్లే బోర్ అయిపోతుంది అనే విషయాన్ని ప్రశాంత్ గుర్తించి ఉంటే బాగుండేది. అయినప్పటికీ.. తన డెబ్యూ మూవీతోనే తన టాలెంట్ ఏమిటో చక్కగా ప్రదర్శించుకున్నాడు ప్రశాంత్.
విశ్లేషణ: ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే సినిమాలు భలే ఆకట్టుకుంటాయి. “భజే వాయు వేగం” కూడా అలాంటిదే. మరీ ఎక్కువ పబ్లిసిటీ స్టంటులు చేయకపోవడం, మూలకథను ట్రైలర్ లోనే చూపించి ఆడియన్స్ ను ప్రిపేర్ చేయడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. మంచి టైమ్ పాస్ కోసం ఈవారం “భజే వాయు వేగం” చిత్రాన్ని హ్యాపీగా చూడొచ్చు!